shooting in US
-
అమెరికా పరిస్థితి మరీ దారుణం.. లైసెన్స్ చూపిస్తే తుపాకీ ఇవ్వాల్సిందే!
అగ్రరాజ్యం అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మూడు వేరు వేరు ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బేలో రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ సోయిల్ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్లు వెల్లడించారు పోలీసులు. షూటర్‌ను స్పాట్లోనే అరెస్ట్ చేశారు. మరోవైపు డెస్ మొయిన్స్లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. అమెరికాలో ఇలా తుపాకీ కాల్పులు జరగడం కొత్త కాదు. ఏటా తుపాకీ కాల్పుల్లో ఎందరో అమాయకులు చనిపోతున్నారు. అగ్రరాజ్యం పేరును తుపాకీ రాజ్యంగా మారిస్తే బెటరన్న సెటైర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో తుపాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే గుండె గుభేల్ మంటుంది. అమెరికాలో అక్షరాలా 39 కోట్లకు పైగా తుపాకులు ఉన్నాయి. అవి 33 కోట్ల మంది ప్రజల ఇళ్లల్లో ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. 1968 నుండి 2017 వరకు 50 ఏళ్ల వ్యవధిలో అమెరికాలో తుపాకులు 15 లక్షలమంది ప్రాణాలు తీసేశాయి. వాటిలో ఆత్మహత్యలూ ఉన్నాయి. హత్యలూ ఉన్నాయి. ఆకతాయిగా చిన్నపిల్లలే దీపావళి తుపాకీ కాల్చినట్లు కాల్చి సాటి పిల్లల్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి. 1775లో అమెరికా స్వాతంత్ర్య పోరాటం నాటి నుండి ఇప్పటి వరకు అమెరికాలో జరిగిన అన్ని యుద్ధాలు.. అమెరికా సైన్యం పాల్గొన్న అన్ని యుద్ధాల్లో కలుపుకున్నా అమెరికాలో తుపాకుల బారిన పడి చనిపోయిన వారికన్నా తక్కువ మందే మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నేవల్ బేస్ పెరల్ హార్బర్ పై జపాన్ చేసిన మెరుపుదాడిలో చనిపోయింది కేవలం 2400 మంది మాత్రమే. సెప్టెంబరు 11న ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మూడువేల చిల్లర మంది మాత్రమే చనిపోయారు. అంతకు ఎన్నో వందల రెట్లు మంది ఏటా తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. సగటున ప్రతీ ఏటా 41 వేల మంది తుపాకీ గుళ్లకు తలలు వాల్చేస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రతీ రోజూ సగటున 53 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు అయిదు నెలలు పూర్తి కాకుండానే తుపాకీ కాల్పుల్లో 17 వేల మందిచనిపోయారు. రాబోయే 7 నెలల్లో ఇంకెంతమందిని తుపాకులు పొట్టన పెట్టుకుంటాయో చెప్పలేని పరిస్థితి. బొమ్మలు కొన్నంత ఈజీగా.. మన దగ్గర సూపర్ మార్కెట్ల తరహాలోనే అమెరికాలో తుపాకుల దుకాణాలు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాయి. తుపాకీ కొనడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరికైనా లైసెన్స్ ఉంటుంది. దాన్ని చూపిస్తే చాలు షాప్‌లో తుపాకీ అమ్మేస్తారు. ఆ తుపాకీ కూడా పెద్ద ఖరీదేం కాదు. నలుగురు యువకులు ఓ మందు పార్టీకి ఖర్చుపెట్టే సొమ్ముతో ఓ మాంచి తుపాకీ వచ్చేస్తుంది. తుపాకీ కొనడానికి కూడా పెద్ద ఆంక్షలు లేవు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా సరే అమెరికాలో యధేచ్ఛగా తుపాకీ కొనుక్కోవచ్చు. దాన్ని జేబులో పెట్టుకుని తిరగచ్చు. తుపాకీ ఎందుకు కొన్నావ్? జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావ్? అని ఎవరూ అడగరు. చిత్రం ఏంటంటే అమెరికాలో మద్యం కొనడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. కానీ తుపాకీ మాత్రం 18 ఏళ్లు నిండితే చాలు. ఇంత లిబరల్ గా తుపాకులు అమ్మేస్తున్నారు కాబట్టే కొనేవాళ్లు కొనేస్తున్నారు. కొన్న తర్వాత ఇళ్లల్లో బీరువాల్లో దాచుకుని మురిసిపోతున్నారు. ఏక్షణంలో నైనా తమ తుపాకీని ఓసారి కాల్చాలని అనిపిస్తే కాల్చేస్తున్నారు. తుపాకుల అమ్మకం అమెరికాలో అతి పెద్ద వ్యాపారం. ఒక్క 2020 లోనే అమెరికాలో 26 లక్షల తుపాకులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంత విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు పుట్టింది కాదు.. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇప్పుడు పుట్టింది కాదు. బ్రిటిష్‌తో స్వాతంత్ర్య పోరాటం చేసే సమయంలో పూర్తి స్థాయి ఆర్మీ లేని అమెరికా పౌరులందరికీ తుపాకులు కలిగి ఉండే హక్కు కల్పించింది. అవసరం వచ్చినపుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత తుపాకులతో యుద్దంలో పాల్గొనాల్సి ఉండేది. దీంతో పాటే ఆహారం కోసం వేటపై ఆధార పడే వాళ్లకు తుపాకులు కలిగి ఉండే హక్కు ఉండేది. అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని రెండవ సవరణలో ప్రతీ అమెరికన్ పౌరుడూ తుపాకీ కలిగి ఉండే స్వేఛ్చను కల్పించారు. శతాబ్ధాల క్రితం పౌరులకు సంక్రమించిన ఈ రాజ్యాంగ బద్ధ హక్కే ఇపుడు అమెరికాని ఆందోళనలోకి నెట్టేస్తోంది. విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో హింస పేట్రేగిపోతోందా? లేక విశృంఖలంగా తుపాకీలు కాల్చేవారిలో మానసిక పరమైన రుగ్మతలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణాల్లో సైంటిస్టులు అధ్యయనాలు చేశారు. వాటిలో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. కొంత మందిలో మానసిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. అటువంటి వారు తమ చేతుల్లో ఉన్న తుపాకులను తమపై వినియోగించుకోవచ్చు లేదంటే ఎదుటి వారిని కాల్చి చంపనూ వచ్చు. అందు చేత ఇది మానసిక పరమైన సమస్యే అంటున్నారు వారు. దీనికి ఇంటిమిటెంట్ ఎక్ప్ ప్లోజివ్ డిజార్డర్ అని పేరు పెట్టారు. ఆ సమస్య ఉన్నవాళ్లకి ఉన్నట్లుండి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. తమ చేతుల్లో తుపాకీ ఉంటే అయిన వాళ్లను కూడా కాల్చి చంపేస్తారు. ఆమధ్య టెక్సాస్ లో 18ఏళ్ల కుర్రాడు తన 18వ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడే దుకాణానికి వెళ్లి ఓ తుపాకీ కొన్నాడు. వెంటనే ఫేస్ బుక్ లో తాను ఆ తుపాకీతో స్కూల్ కి వెళ్లి కాలుస్తానని పోస్ట్ పెట్టాడు కూడా. అయితే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ కుర్రాడు తాను కొన్న తుపాకీతో తన నాయనమ్మను కాల్చి చంపి ఆ తర్వాత స్కూల్ కి వెళ్లి పదేళ్ల వయసుండే పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 19 మంది అక్కడి కక్కడే చనిపోయారు. ఆయుధ వ్యాపారులదే పవర్.. అదీ కాక తుపాకుల వ్యాపారంలో మునిగి తేలే ఆయుధ వ్యాపారులే అమెరికాని శాసిస్తూ ఉంటారు. ఆయుధ వ్యాపారులకు కోపం తెప్పించే పని చేయడానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు. గతంలో తుపాకుల విక్రయాలపై ఆంక్షలు ఉండాల్సిందేనని బారక్ ఒబామా గట్టిగానే అన్నారు కానీ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఆపని చేయలేకపోయారు. ఒబామా తర్వాత అధ్యక్షుడైన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత కాబట్టి తుపాకులకు సహజంగానే సానుకూలం. ఇపుడు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ అధ్యక్షుడి గా ఉన్నాడు. ► 1999లో కొలరాడో లో తుపాకీ కాల్పుల్లో 12 మంది చిన్నారులు మృతి చెందారు. ► 2005 మార్చ్ లో మిన్నెసోటా లో కాల్పుల ఘటనలో ఏడుగురు చనిపోయారు. ► 2007 లో వర్జీనియాలో కాల్పుల్లో 32 మంది చనిపోయారు. ► 2012లో కనెక్టికట్ లో 26 మంది దుర్మరణం చెందారు. ► 2015లో ఓరేగాన్ లో 9 మంది విగతజీవులయ్యారు. ► 2018లో హ్యూస్టన్ లో 10 మంది ,ఫ్లోరిడాలో 17 మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాదాలు. అమెరికా చరిత్ర నిండా ఎన్నో బుల్లెట్ గాయాలు. తల్లిదండ్రులకు తీరని గర్బశోకాలు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ తుపాకులను ఇంత విచ్చలవిడిగా వినియోగించిన దాఖలాలు లేవు. తుపాకుల విక్రయంలోనూ అమెరికాకు దరిదాపుల్లో మరో దేశం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యమే అతి పెద్ద విలన్ అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరచి తుపాకీల వ్యాపారంపైనా వాటి వినియోగంపైనా ఉక్కుపాదం మోపకపోతే అమాయక బాల్యం తుపాకీ కాల్పుల్లో కాలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి? -
అమెరికాలో కాల్పుల మోత..!
ప్రజాప్రతినిధులపై పేలిన తూటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్కు సమీపంలోని వర్జినీయా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం బేస్‌బాల్ ఆట ఆడుతుండగా రైఫిల్ తో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రతినిధుల సభ మెజారిటీ విప్, రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ గాయపడ్డాడు. పలువురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సాయుధుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్వేతజాతీయుడైన ఓ సాయుధుడు రైఫిల్‌తో ప్రజాప్రతినిధులు బేస్‌బాల్ ఆడుతున్న మైదానానికి వచ్చి కాల్పులకు దిగాడని, దీంతో అక్కడ ఒక్కసారిగా 50 నుంచి వందరౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షి అయిన అలబామా ప్రజాప్రతినిధి మో బ్రూక్స్ తెలిపారు. ఈ కాల్పులతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పాడు. రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ పిరుదు భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అదేవిధంగా ఈ కాల్పుల్లో చట్టసభ సిబ్బంది, పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన సీఎన్ఎన్ చానెల్‌కు తెలిపారు.