కన్హయ్యను కాల్చిచంపితే ..11లక్షలు
కన్హయ్య నాలుక కోస్తే 5 లక్షల రూపాయలు కానుక
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక కోస్తే బహుమతి ఇస్తామని ప్రకటించడంతో చెలరేగిన వివాదం అలా ముగిసిందో లేదో మరో ప్రకటన కలకలం రేపింది. అతడిని కాల్చి చంపితే రూ. 11 లక్షలు బహుమతి ఇస్తామంటూ ఢిల్లీలోని ఓ సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్లు వెలువడ్డాయి.
దేశద్రోహి కన్హయ్యకుమార్ ను కాల్చిచంపితే 11 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ కొడుకు పేరుతో ఢిల్లీ వీధుల్లో హిందీలో పోస్టర్లు వెలిశాయి. తాను బిహార్ లోని కన్హయ్యకుమార్ గ్రామం బెగుసరాయ్ గ్రామానికి సమీపంలోనే ఉంటానని అందులో పేర్కన్నారు. మొబైల్ నెంబర్ వివరాలతో సహా ముద్రించిన ఈ తాజా పోస్టర్లు వివిధ బస్లాప్ లు, మెట్రో స్టేషన్ సెంటర్లలో సంచలనంగా మారాయి.
మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత విద్యార్థి నేత ప్రసంగం తనను చాలా కలిచివేసిందని ఆదర్శ్ శర్మ మీడియాతో తెలిపారు. ప్రాథమికంగా కన్హయ్య కుమార్ నిర్దోషి అని నమ్మానని.. కానీ తదనంతర పరిణామాలతో మాతృభూమికి ద్రోహం చేస్తున్న మనిషిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. దీన్నిఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని శర్మ వ్యాఖ్యానించారు. దీనిపై తమ సంఘ ప్రతినిధులతో మాట్లాడి ఈ రివార్డు నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 1500 పోస్టర్లను వేశామని శర్మ తెలిపారు.
భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే.. కన్హయ్య కుమార్ నాలుక కోస్తే 5లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన పార్టీ అతణ్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కాగా దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్ ఈ నెల 3 న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థి నేత ప్రసంగం రాజకీయ విశ్లేషకుల్లో సైతం చర్చకు దారి తీసింది.