గన్‌తో బెదిరిస్తే.. స్వీట్లతో కొట్టింది!
మాల్మో: ఓ షాపింగ్ మాల్లో దోపిడి చేయడానికి వచ్చిన ఘరానా దొంగకు షాపులో పనిచేసే యువతి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. గన్ చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండగా ఆ యువతి స్వీట్లతో ఎదురు దాడి చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని సదరు దొంగ పరుగులంకించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్‌లోని మాల్మో పట్టణంలో జైనాబ్ సలీం అనే యువతి ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. లేట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న జైనాబ్‌కు మంగళవారం ఊహించని ఘటన ఎదురైంది. క్యాష్ కౌటర్ వద్ద ఉన్న ఆమె వైపు ఓ దోపిడి దొంగ గన్‌తో వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. క్షణాల్లో తేరుకున్న జైనాబ్.. చేతికందిన స్వీట్లతో ఎదురుదాడికి దిగింది. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన దొంగ డబ్బులొద్దు ముర్రో అంటూ షాపు నుండి బయటకు పరుగులు పెట్టాడు. సమీపంలోనే ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చిన జైనాబ్ దొంగను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించింది.
ఈ ఘటనపై జైనాబ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ఐదు సార్లు దోపిడి దారులు బారిన పడ్డాను. ఒకడు గొడ్డలితో, మరొకడు ఇనుప రాడ్డుతో బెదిరించాడు. అయితే ఈ సారి మాత్రం అప్రయత్నంగానే నేను స్పందించాను. ఒకవేళ ఆ గన్ లోడ్ చేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటే భయమేస్తోంది' అని తెలిపింది.