పొట్టిగా ఉన్నారా.. మీకు నూరేళ్ల ఆయుష్సు
లండన్: పొట్టిగా ఉన్నామని దిగులు చెందవద్దు..! తక్కువ ఎత్తు ఉండటం ప్రేమకు ప్రతిబంధకమవుతుందని ఆందోళన చెందాల్సిన పనేలేదు. ఎందుకంటే పొట్టిగా ఉండటం కూడా ఓ వరం. పొడుగువారితో పోలిస్తే పొట్టివాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట. జపాన్ దేశీయులు అందులోనూ మగవాళ్లపై నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
పొడుగు వారితో పోలిస్తే పొట్టివారిలో చాలా సానుకూలతలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. పొట్టివారు చాలావరకు సహజంగానే తక్కువ బరువు, శరీరాకృతితో ఉంటారు. శరీరంలో రక్తంలో ఇన్సులిన్ మోతాదు తక్కువగా ఉంటుంది. అంతేగాక కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు జీవన ప్రమాణాలను పెంచుతాయని, పొట్టివారు ఎక్కువ కాలం జీవించగలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. జపనీయులను రెండు కేటగిరిలుగా విభజించి పరిశోధన నిర్వహించారు. 5.2 అడుగుల కంటే తక్కువగా ఉన్నవారు, 5.4 అడుగుల కంటే పొడుగుగా ఉన్నవారు..... ఇలా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉన్నవారిపై పరిశోధనలు చేశారు. పొట్టవాళ్లే ఎక్కువ రోజులు జీవిస్తున్నట్టు కనుగొన్నారు. 1900-1919 మధ్య జన్మించిన 8,006 మంది మగవాళ్లపై 1965లో పరిశోధన ప్రారంభించారు. వీరిలో 1,200 మంది 90 నుంచి 100 ఏళ్ల వరకు బతికారు. 250 మంది ఇంకా జీవిస్తున్నారు. ఎక్కువ కాలం జీవించిన వాళ్లందరూ పొట్టివాళ్లే కావడం విశేషం.