అసౌకర్యాల పరీక్ష
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఒక వైపు మండే ఎండలు..మరోవైపు అరకొర సౌకర్యాల మధ్య గురువారం జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణకేంద్రాల్లో చాలీచాలని బెంచీలు, పక్కపక్కనేకూర్చుని పరీక్ష రాయడం కనిపించింది. మండల కేంద్రాల్లో విద్యుత్ కోత, ఫర్నిచర్ కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష మొదటి రోజు కావడంతో విద్యార్థులు ఉదయం 7 గంటలకే రోడ్డుపైకి వచ్చారు. అధిక శాతం నేరుగా దేవాలయాలకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం 8.30 గంటల నుంచి వారు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే 9.30 గంటలు దాటి వచ్చినా 10 గంటల వరకు విద్యార్థులను అనుమతించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం మొదటిరోజు మొత్తం 53,340 మంది విద్యార్థులకు గాను 52, 599 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 751 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కర్నూలు, ఆదోని, నంద్యాల వంటి పట్టణాల్లో మినహా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అధిక శాతం విద్యార్థులు నేలపైనే కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కర్నూలు నగరంలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డీఈవో కె. నాగేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు.