Showrya Medal
-
తిరిగిచ్చేసింది
ఎంత ధైర్యం గల మహిళ! డ్రగ్ లార్డ్‌ని అరెస్ట్ చేసింది. సీఎంని క్వొశ్చన్ చేసింది. చీఫ్ జస్టిస్‌ని ప్రశ్నించింది. ఇప్పుడు.. తన గ్యాలెంట్రీ మెడల్నే విసిరికొట్టేసింది. నీతి, నిబద్ధత గలవాళ్లంతే! వాళ్లకు డ్యూటీ ఫస్ట్. బృందాకైతే డ్యూటీనే సర్వస్వం. థోనావ్జామ్ బృందా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ‘ఫియర్ లెస్’ అని ఆమెకు పేరు. ఐదు నెలల క్రితం సంచలనాత్మకమైన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు ఆమె. అధికారంలో ఉన్నవారితో నేరుగా డీకొనడమే అది. మణిపూర్ ఏమైపోతోంది? బాలలకు మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాం.. అని పాలక పక్షాన్నే భుజాలు తడుముకునేలా చేశారు బృందా. ఇక మొన్నటి శుక్రవారం అయితే ఆమె తన ‘శౌర్య అవార్డు’ను ప్రభుత్వం ముఖాన దాదాపుగా విసరికొట్టేసినంత పనిచేశారు. డ్రగ్స్ మాఫియా యుద్ధంలో పై చేయి సాధించినందుకు ప్రశంసగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రెండేళ్ల క్రితం బృందాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పోలీస్ గ్యాలెంట్రీ అవార్డు ప్రదానం చేశారు. శౌర్య అవార్డు అందుకున్న రాష్ట్ర ‘నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ బ్యూరో’ (న్యాబ్) తొలి పోలీస్ ఆఫీసర్ బృందా. 2018 జూన్‌లో ‘న్యాబ్’ అధికారిగా డ్యూటీలోకి రాగానే ఆమె మొదట చేసిన పని డ్రగ్ లార్డ్ లుకోసీ జౌ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో ఆమె అరెస్ట్ చేస్తే, ఆగస్టులో ఆమెకు గ్యాలెంట్రీ అవార్డు వచ్చింది. అవార్డును ఇచ్చినట్లే ఇచ్చి, లుకోసీ జౌను కేసు నుంచి తప్పించమని బృందాపై ఒత్తిడి తెచ్చారు ముఖ్యమంత్రి. ఆమె వినలేదు. అరెస్ట్ అయిన నాలుగో రోజు నుంచే లుకోసీ బెయిల్ పై తిరుగుతున్నాడు. చివరికి గురువారం ఇంఫాల్ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడికి బెయిల్ ఇవ్వడంపై కోర్టును ప్రశ్నిస్తూ వస్తున్న బృందాను కోర్టు తీవ్రంగా మందలించింది. ఎఎస్పీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో లుకోసీని వదిలేయడం జరిగిందని తీర్పు చెప్పింది. దీనంతటి వెనుక ఎవరున్నారో బృందాకు తెలుసు. అందుకే తన మెడల్‌ను తిరిగి ఇచ్చేశారు. ‘‘నేను ఈ మెడల్‌కు అనర్హురాలిని. సమర్థులైన మరొకరికి దీనిని ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రెండేళ్లలోనూ.. చెబుతున్నా వినకుండా లుకోసీని అరెస్టు చేసినందుకు మణిపుర్‌లోని బి.జె.పి. ప్రభుత్వం బృందాను అనేక విధాలుగా వేధించింది. ఉద్యోగం తీయించడమే ఒక్కటే తక్కువ. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అర్థరహితమైన ఆరోపణతో కూడా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది! అదే నెలలో బృందా మామగారు 76 ఏళ్ల రాజ్‌కుమార్ మేఘన్‌కు భద్రత కల్పించే నెపంతో ఆ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. మేఘన్ మణిపుర్‌లోని తిరుగుబాటు ‘యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఛైర్మన్. ఆయన 44 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబరులో గౌహతి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వచ్చారు. బృందా 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మణిపుర్‌నూ అంతగా ప్రేమిస్తారు. మణిపుర్ భవిష్యత్ తరాల భద్రత, సంరక్షణల కోసమే ఆమె ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నానంటారు. -
శౌర్యానికి ప్రతిరూపం
నీడని సైతం అనుమానించాలి. నిఘా నేత్రం ప్రసరించాలి. నేత్ర వీక్షణం సునిశితంగా సాగాలి. అప్పుడే సైనికుడు శత్రువు అంతు చూడగలడు. అవన్నీ ప్రదర్శించబట్టే ఆబోతుల వెంకటరావు ఆత్మాహుతి ముష్కర మూకల్ని మట్టుబెట్టగలిగాడు. వందలాది భారత వీరుల ఊపిరి నిలబెట్టగలిగాడు. భారత ప్రభుత్వ ‘శౌర్యచక్ర’ పురస్కారం అందుకోగలిగాడు. ఆయన సాహసం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రక్తం తాగే పిశాచాలని కుమ్మేసిన ఆబోతుల వెంకటరావు సాహసగాథ ఆయన మాటల్లో చదవండి. – విజయనగరం టౌన్ ఆరోజు 2016 అక్టోబర్ 6వ తేదీ. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ నియంత్రణ రేఖలో విధులు నిర్వరిస్తున్నాను. నేనున్న 8 మద్రాస్ జనరల్ రెజిమెంట్ ముందు అలజడి.. ఏదో జరుగుతోంది.. అనుమానం నిజమైంది. శత్రువులు చొరబడ్డారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు మిలిటెంట్లు తచ్చాడుతున్నారు. ఆర్మీ రెజిమెంట్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు.. సమయం లేదు.. అప్రమత్తం కావాలని సైన్యాన్ని సూచనలు ఇచ్చాను. ఇది గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్యాంప్‌లోకి చొరబడి ఆత్మాహుతి చేసుకోవాలన్నది వారి పన్నాగం. అదే జరిగితే.. పది నిమిషాల్లో మొత్తం బూడిదయ్యేది. సుమారు 350 మంది సైనికులు బలయ్యేవారు. గతంలో కమాండ్ కంట్రోల్ కోర్సులో పొందిన శిక్షణ నాకెంతగానో ఉపయోగపడింది. ఏకే 47తో పాయింట్ వ్యూలో ఒకే షాట్లో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాను. ఆ వెంటనే.. మూడో తీవ్రవాదిని కూడా మట్టుబెట్టాను. డ్యూటీ పోస్టులో ఉన్న ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా కాకుండా కాపాడాను. చిన్నప్పటినుంచి సైన్యమంటే ఆసక్తి మాది విజయనగరం వద్ద జమ్మునారాయణపురం గ్రామం. ఇంటర్ మీడియట్ వరకూ చదివాను. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న ఆసక్తి వల్ల సాధన చేసేవాడిని. ఇంటర్మీడియట్ పూర్తయిన సమయంలో తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో డాక్యుమెంటేషన్‌లో నెగ్గలేకపోయాను. ఆ తర్వాత 2009లో విజయనగరం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రత్యేక విధుల్లో భాగంగా యూఎన్ఓలో సభ్యత్వం పొందిన ఆఫ్రికాలోని సౌత్ సూడాన్‌కి పంపించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వరిస్తున్నాను. 2013లో శ్యామలని వివాహం చేసుకున్నాను. మూడున్నరేళ్ల హరిణి, నాలుగునెలల ఈషా నా సంతానం శౌర్యచక్ర ఓ అద్భుతం నా సాహసం గుర్తించిన మా టీమ్, ఆర్మీ రెజిమెంట్ శౌర్యచక్రకు నామినేట్ చేయడం.. రాష్ట్రపతి కోవింద్ నుంచి పురస్కారం అందుకోవడం ఓ అద్భుతమైతే.. 60 ఏళ్లలో మా రెజిమెంట్‌కు వచ్చిన తొలి శౌర్య అవార్డు కావడం ఆనందంగా ఉంది. జిల్లాలో కూడా తొలి శౌర్యచక్ర అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎంతో ఆనందంగా ఉంది భారతదేశం గర్వించదగ్గ పురస్కారాన్ని శౌర్యచక్ర మా బిడ్డ అందుకోవడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామం నుంచి వెళ్లి సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా శత్రుమూకల్ని చీల్చి చెండాడిన వెంకటరావు సేవల్ని గుర్తించడం మరువలేం. –రాము, చిట్టమ్మ -
ఎస్ఐ సిద్ధయ్యకు శౌర్యపతకం
జడ్చర్ల : దివంగత ఎస్ఐ సిద్ధయ్యకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్యపతకం దక్కింది. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, సాహసోపేతానికి గుర్తింపుగా లభించే ఈ అవార్డు సిద్ధయ్యకు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, జడ్చర్ల వాసులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 4న నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జడ్చర్ల ఎస్ఐ సిద్ధయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు అదే నెల 7న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ధరణీశతోపాటు కుమారుడు ఉన్నారు.