థోనావ్జామ్ బృందా, ఐపీఎస్
ఎంత ధైర్యం గల మహిళ! డ్రగ్ లార్డ్‌ని అరెస్ట్ చేసింది. సీఎంని క్వొశ్చన్ చేసింది. చీఫ్ జస్టిస్‌ని ప్రశ్నించింది. ఇప్పుడు.. తన గ్యాలెంట్రీ మెడల్‌నే విసిరికొట్టేసింది. నీతి, నిబద్ధత గలవాళ్లంతే! వాళ్లకు డ్యూటీ ఫస్ట్. బృందాకైతే డ్యూటీనే సర్వస్వం.
థోనావ్జామ్ బృందా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ‘ఫియర్ లెస్’ అని ఆమెకు పేరు. ఐదు నెలల క్రితం సంచలనాత్మకమైన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు ఆమె. అధికారంలో ఉన్నవారితో నేరుగా డీకొనడమే అది. మణిపూర్ ఏమైపోతోంది? బాలలకు మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాం.. అని పాలక పక్షాన్నే భుజాలు తడుముకునేలా చేశారు బృందా. ఇక మొన్నటి శుక్రవారం అయితే ఆమె తన ‘శౌర్య అవార్డు’ను ప్రభుత్వం ముఖాన దాదాపుగా విసరికొట్టేసినంత పనిచేశారు. డ్రగ్స్ మాఫియా యుద్ధంలో పై చేయి సాధించినందుకు ప్రశంసగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రెండేళ్ల క్రితం బృందాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పోలీస్ గ్యాలెంట్రీ అవార్డు ప్రదానం చేశారు.
శౌర్య అవార్డు అందుకున్న రాష్ట్ర ‘నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ బ్యూరో’ (న్యాబ్) తొలి పోలీస్ ఆఫీసర్ బృందా. 2018 జూన్‌లో ‘న్యాబ్’ అధికారిగా డ్యూటీలోకి రాగానే ఆమె మొదట చేసిన పని డ్రగ్ లార్డ్ లుకోసీ జౌ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో ఆమె అరెస్ట్ చేస్తే, ఆగస్టులో ఆమెకు గ్యాలెంట్రీ అవార్డు వచ్చింది. అవార్డును ఇచ్చినట్లే ఇచ్చి, లుకోసీ జౌను కేసు నుంచి తప్పించమని బృందాపై ఒత్తిడి తెచ్చారు ముఖ్యమంత్రి. ఆమె వినలేదు. అరెస్ట్ అయిన నాలుగో రోజు నుంచే లుకోసీ బెయిల్ పై తిరుగుతున్నాడు. చివరికి గురువారం ఇంఫాల్ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడికి బెయిల్ ఇవ్వడంపై కోర్టును ప్రశ్నిస్తూ వస్తున్న బృందాను కోర్టు తీవ్రంగా మందలించింది.
ఎఎస్పీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో లుకోసీని వదిలేయడం జరిగిందని తీర్పు చెప్పింది. దీనంతటి వెనుక ఎవరున్నారో బృందాకు తెలుసు. అందుకే తన మెడల్‌ను తిరిగి ఇచ్చేశారు. ‘‘నేను ఈ మెడల్‌కు అనర్హురాలిని. సమర్థులైన మరొకరికి దీనిని ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రెండేళ్లలోనూ.. చెబుతున్నా వినకుండా లుకోసీని అరెస్టు చేసినందుకు మణిపుర్‌లోని బి.జె.పి. ప్రభుత్వం బృందాను అనేక విధాలుగా వేధించింది. ఉద్యోగం తీయించడమే ఒక్కటే తక్కువ. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అర్థరహితమైన ఆరోపణతో కూడా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది! అదే నెలలో బృందా మామగారు 76 ఏళ్ల రాజ్‌కుమార్ మేఘన్‌కు భద్రత కల్పించే నెపంతో ఆ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టింది.
మేఘన్ మణిపుర్‌లోని తిరుగుబాటు ‘యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఛైర్మన్. ఆయన 44 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబరులో గౌహతి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వచ్చారు. బృందా 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మణిపుర్‌నూ అంతగా ప్రేమిస్తారు. మణిపుర్ భవిష్యత్ తరాల భద్రత, సంరక్షణల కోసమే ఆమె ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నానంటారు.
Comments
Please login to add a commentAdd a comment