తాగి తప్పించుకున్నా.. ఫేస్'బుక్కై' పోయింది!
ఓ అమ్మాయి మందు కొట్టి డ్రైవింగ్ చేసింది. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అదృష్టవశాత్తూ తప్పించుకుంది. అంతటితో 'ఊపిరి' పీల్చుకుని మరచిపోకుండా తన ఘనతను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ప్రొహిబిషన్ అధికారులు ఈ అమ్మడిని మరోసారి పిలిపించారు. ఈ సారి అడ్డంగా దొరికిపోయింది. జైలుకెళ్లాల్సిన పరిస్థితి చేజేతులా తెచ్చుకుంది. అనవసరంగా ఫేస్'బుక్కై'పోయింది. అమెరికాలోని వెస్ట్ లాండ్కు చెందిన కొలీన్ కుడ్నీ కథ ఇది. వివరాలిలా ఉన్నాయి.
22 ఏళ్ల కొలీన్ రెండేళ్ల క్రితం మద్యం తాగి డ్రైవింగ్ చేసింది. అయితే మర్నాడు ఆమెకు ప్రొహిబిషన్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఒక రోజు గడిచిపోవడంతో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్ట్లో లక్కీగా బయటపడింది. కొలీన్ ఈ విషయాన్ని అంతటితో మరచిపోకుండా ఆ విషయాన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి సంతోషం పంచుకుంది. 'నేను నిన్న మందు కొట్టి డ్రైవ్ చేశా. ఈ రోజు ఉదయం టెస్ట్ చేయడంతో పాసయ్యా. థ్యాంక్ గాడ్' అని రాసింది. ఈ విషయం వెంటనే వెస్ట్ లాండ్ పోలీసులకు తెలియడం.. వారు ప్రొబెషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో కొలీన్కు కష్టాలు మొదలయ్యాయి.
'కొలీన్ చేతులా దొరికిపోయింది.. ఈ సారి పాస్ అవ్వమనండి చూస్తాం' అంటూ ప్రొబెషన్ ఆఫీస్ నుంచి ఆమెకు మళ్లీ కబురెట్టారు. కొలీన్కు ఈసారి యూరిన్ టెస్టు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మద్యం తాగిన 80 గంటల తర్వాత కూడా ఈ పరీక్షలో గుర్తించవచ్చు. ఇంకేముంది కొలీన్ సాక్ష్యాలతో సహా దొరికిపోయింది. ఈ కేసుకు త్వరలోనే ముగింపు పలకనున్నారు. ఏప్రిల్ 1న కోర్టులో హాజరపరచనున్నారు. ఆమెకు మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.