ఆలయాలకు శ్రావణ శోభ
కీసర, న్యూస్‌లైన్: ప్రఖ్యాత శైవక్షేత్రమైన కీసరగుట్ట ఆలయంలో బుధవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు శ్రావణ మాసోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆలయ వేదపండితులు పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 7న స్వామి సన్నిధిలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు.
ఈ నెల 11న నాగుల పంచమి, 12న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణం, నానాఫలరసాభిషేకం, 14న విశాఖ నక్షత్రం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం, 16న వరలక్ష్మీ వ్రతం, 17న సత్యనారాయణ స్వామి వ్రతం, 18న నానావిధ పత్రి పూజ, 19న క్షీరాభిషేకం, 21న రాఖీ పౌర్ణమి వేడుక, 23న భస్మాభిషేకం, 24న గంధాభిషేకం, 31న శ్రీరామలింగేశ్వరస్వామివారి కల్యాణోత్సం, సెప్టెంబరు 1న శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, 2న పంచామృతాభి షేకం, 3న రుద్ర హవనం, యథాశక్తి బిల్వార్చన, 5న తైలాభిషేకం, అన్నపూజ కార్యక్రమాలతో శ్రావణమాసోత్సవ ప్రత్యేక పూజలు ముగుస్తాయన్నారు. శ్రావణమాసోత్సవాల సంద ర్భంగా కీసరగుట్టకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు వారు తెలిపారు. లడ్డూ ప్రసాదాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. గర్భాలయ అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంటుం దని, ఈ సందర్భంగా సామాన్య భక్తులకు స్వామి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు.