సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?
సంపన్న కుటుంబంలో పుట్టి ఆ వారసత్వ సంపదను నిలుపుకోవడంలో, రెట్టింపు చేయడంలో చాలామంది సక్సెస్ అవుతారు. మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదుగుతారు. కానీ కోట్లకు పడగలెత్తినా ఎలాంటి ఆడంబరాలు, విలాసాలకు తావు లేకుండా అతి సాధారణ జీవితాన్ని గడిపేవారు చాలా అరుదు. దాతృత్వంలో సర్వ ధార పోసి తమకు తామే సాటి అని చాటుకుంటారు. అలాంటి వారిలో ఘనుడు 85 ఏళ్ల శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్.
తమిళనాడులోని సంపన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన త్యాగరాజన్ 37 సంవత్సరాల వయస్సులో బంధువులు, స్నేహితులతో శ్రీరామ్ చిట్స్‌ను స్థాపించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1974లో చెన్నైలో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. అంతకు ముందు 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరి, వివిధ ఫైనాన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పని చేస్తూ ఇరవై సంవత్సరాల అనుభవాన్ని గడించారు. ఆర్థికంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని వ్యాపార దిగ్గజంగా ఎదగడం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, మానవత్వం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్న మహా మనీషి ఆయన.పేరుకు తగ్గట్టే త్యాగంలో రారాజు.
నా దృష్టి అంతా వారిమీదే
ఈ అనుభవంతోనే సాంప్రదాయ బ్యాంకులు పట్టించుకోని తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించారు. ట్రక్కులు, ట్రాక్టర్లు , ఇతర వాహనాల కోసం సమాజంలోని పేదవర్గాలకు రుణాన్ని అందించడంలో కంపెనీ అగ్రగామిగా ఉంది. వెనుకబడిన వారికి సహాయం చేయడంలోని అతని నమ్మకం కంపెనీ వృద్ధికి దారితీసింది. ఫలితంగా కంపెనీ రూ. 6210 కోట్లు కంటే ఎక్కువ విలువైన సంస్థగా అవతరించింది. 23 మిలియన్లకు పైగా వినియోగదారులతో 30 కంపెనీలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. శ్రీరామ్ గ్రూపు షేర్లు ఈ సంవత్సరం 35శాతం పెరిగి జూలైలో రికార్డ్ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
అంతేకాదు వ్యాపారంలో ఘన విజయం సాధించిన త్యాగరాజన్ దృష్టి కేవలంకంపెనీని విజయంబాటపట్టించడే కాదు.. స్వయంగా కమ్యూనిస్టు భావాలను రంగరించు కున్న ఆయన తన విజయంలో కంపెనీ ఉద్యోగులపాత్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వారి కష్టాలు,సవాళ్లను స్వయంగా అర్థం చేసుకున్నారు కనుకనే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల ( 750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సామ్రాజ్యం విజయానికి, కోట్ల సంపదకు ఆర్జనకు సహకరించిన వారి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. సందపను పంచి ఇవ్వాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా పాటించారు.
కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం,అతి సాధారణ జీవితం
బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,క్రెడిట్ చరిత్ర లేని వారికి డబ్బు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి కంపెనీని ప్రారంభించినట్లు త్యాగరాజన్ చెప్పారు. అంతేకాదు వ్యాపారవేత్తగా అతి సాధారణ జీవితంలో గడపడంలో ఆయనే తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.దుబారా అంటే అస్సలు నచ్చదు. ఐఫోన్, ఖరీదైన కారు, లగ్జరీ ఇల్లు, సదుపాయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకున్న త్యాగరాజన్ చిన్న ఇల్లు, రూ. 6 లక్షల విలువైన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ కారుతో చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ ప్రతీ 15 రోజులకు ఒకసారి కంపెనీ సీనియర్ మేనేజర్లతో సమావేశమవుతూ, సలహాలు, సూచనలతో శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్దికి బాటలు వేస్తున్నారు.
త్యాగరాజన్ ఎక్కడ పుట్టారు?
త్యాగరాజన్ 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్, మాథ్య్స్లో మాస్టర్స్ చేశారు. తరువాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో దేశీయ అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలోనూ, దాదాపు రెండు దశాబ్దాల పాటు వైశ్యా బ్యాంక్, రీఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ JB బోడా అండ్ కోలో పనిచేశారు.
శ్రీరామ్స్ సంస్థల కారణంగా వడ్డీ రేట్లు దిగి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు 200 మిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది.
శ్రీరామ్ కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల గ్రూపునకు కేటాయించి, 2006లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేసిన గొప్ప వ్యక్తి త్యాగరాజన్. ఈ శాశ్వత ట్రస్ట్‌లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ట్రస్ట్ హోల్డింగ్ మొత్తం విలువ 750 మిలియన్లడాలర్లకు పైమాటే. ఇటీవల శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కో. శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లను షేర్-స్వాప్ డీల్‌లో విలీనం చేసుకుంది.