మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి.
ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది.
ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి.
వాటాదారుల వివరాలివీ...
మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది.