Shujaat Bukhari
-
‘అతనికే బతికే అర్హత లేకపోతే.. ఇక ఎవరికుంది?’
కశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ జర్నలిస్టు, ‘రైజింగ్ కశ్మీర్’ పత్రిక సంపాదకుడు షుజత్ బుఖారీ మరణించి నేటికి సరిగ్గా ఏడాది. షుజత్ మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు. నేటికి కూడా ఆయన లేడనే వార్తను చాలా మంది నమ్మలేకపోతున్నారు. షుజత్ బుఖారీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య డాక్టర్ తహ్మీనా బుఖారీ తన భర్త రాసిన వ్యాసాలను ‘కశ్మీర్స్ థిన్ రెడ్‌లైన్స్ ఇన్ శ్రీనగర్’ పేరిట ఓ సంకలనంగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భర్తను తల్చుకోని భావోద్వేగానికి గురయ్యారు తహ్మీనా. ఆమె మాటల్లోనే.. ‘తను(షుజత్ బుఖారీ) మరణించాక నా జీవితం చాలా కష్టంగా మారింది. తన చావు నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. తన గురించి ఆలోచించినప్పుడల్లా.. నాకు ఎల్లా వేళలా తోడుగా నిలిచే మనిషి నేడు నన్ను విడిచి వెళ్లాడని గుర్తుకొస్తుంది. అలా అనిపించగానే నా గుండె బరువెక్కుతుంది. ఇప్పుడా మనిషి మా మధ్య ఉంటే.. తన పిల్లలకు గైడ్‌గా మారి.. ఈ ప్రపంచంతో ఎలా మెలగాలో చెబుతుండేవాడు. తను ఇక లేడు.. ఎన్నటికి తిరిగి రాడు. నీ భర్తను ఎందుకు చంపారని జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు. సాధరణంగా నాకు నేనే ఎన్నో సార్లు ఈ విషయం గురించి ప్రశ్నించుకొన్నాను. కానీ నాకు సమాధానం దొరకలేదు. అయితే ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం కల్గుతుంటుంది. షుజత్ బుఖారీ లాంటి ఓ వ్యక్తిని బతకడాని వీల్లేదని చంపేస్తే.. ఇక ఈ భూమ్మిద బతికే హక్కు ఎవరికుంటుంది అని ఆశ్చర్యపోతుంటాను’ అన్నారు. ‘తనను చంపడానికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి. కానీ నా దగ్గర సమాధానం మాత్రం లేదు. ఇదంతా జరిగిపోయింది. నా భర్త చనిపోయాడు.. తననేవరు తిరిగి తీసుకురాలేరు. నాకు దేవుడు ఇచ్చే తీర్పే అన్నింటికంటే ఉన్నతమైనది. తను పై నుంచి ప్రతి దాన్ని చూస్తుంటాడు. నా భర్త విషయంలో దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నాకా నమ్మకం ఉంది. షుజత్ను ఓ గొప్ప తండ్రిగా.. భర్తగా గుర్తు చేసుకుంటాను.. తనతో గడిపిన అందమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటాను. తనొక జర్నలిస్ట్‌గా, శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా మాత్రమే జనాలకు తెలుసు. కానీ నేను తనలో ఉన్న మరో కోణాన్ని త్వరలోనే జనాల ముందు ఆవిష్కరిస్తాను. ఓ పుస్తకం రూపంలో తనలోని మరో గొప్ప వ్యక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. తను వదిలి వెళ్లిన ఆశయాలను పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం’ అన్నారు. ‘ఈ వ్యాస సంకలనాన్ని షుజత్ నిర్మించిన సంస్థకు.. అతని పిల్లలకు అంకితం ఇస్తున్నాను. తనతో పని చేసే వారిలో షుజత్ ఆత్మవిశ్వాసాన్ని మెండుగా నింపాడు. భయం లేని జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాడు. షుజత్ లేడు.. ఇక రైజింగ్ కశ్మీర్ పని కూడా ముగిసి పోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ దీన్ని అబద్దమని నిరూపిస్తాం. ఇక ఈ ‘కశ్మీర్స్ థిన్ రెడ్ లైన్స్ ఇన్ శ్రీనగర్’ సంకలనం షుజత్ ఆలోచనలకు ప్రతిరూపం. తన అభిప్రాయాలకు.. ఆసక్తులకు.. సంబంధించినవే కాక తనకు విలువైనవిగా అనిపించిన విషయాలను కూడా ఇందులో ప్రస్తావించాడు’ అన్నారు. -
లష్కరే కమాండర్ నవీద్ జఠ్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో భద్రతా సిబ్బంది, పౌరులపై పలు అమానుష దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా కమాండర్ నవీద్ జఠ్ (22) హతమయ్యాడు. కశ్మీరీ సీనియర్ పాత్రికేయుడు షుజాత్ బుఖారీ హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కశ్మీర్ బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో జఠ్తో పాటు అతని సహచరుడుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. గతంలో జఠ్ ఆరు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతడు పోలీసు కస్టడీ నుంచే నాటకీయ పరిణామాల నడుమ పారిపోవడం సంచలనం సృష్టించింది. జఠ్ పాకిస్తానీయుడని, విధానపర లాంఛనాల ప్రకారం అతని మృతదేహాన్ని పాకిస్తాన్‌కు అప్పగిస్తామని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిందిలా.. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో బుద్గాంలోని కుత్పోరా చాతర్ గామ్ అనే ప్రాంతంలో బుధవారం వేకువ జామునే భద్రతా సిబ్బంది తనిఖీల్ని ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. సూర్యోదయం అయ్యాక ఇద్దరు మిలిటెం ట్లను భద్రతా సిబ్బంది అంతమొందించారు. మృతుల్లో ఒకరిని నిషేధిత ఎల్ఈటీ కమాండర్ నవీద్ జఠ్గా గుర్తించారు. కసబ్‌కు సహాధ్యాయి.. పాక్‌లోని ముల్తాన్‌లో జన్మించిన నవీద్ జఠ్.. 26/11 ముంబై దాడిలో సజీవంగా చిక్కిన అజ్మల్ కసబ్‌కు మదరసాలో సహాధ్యాయి. వీరిద్దరు అక్కడే ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సముద్ర మార్గంలో వినియోగించే దిక్సూచి కంపాస్, జీపీఎస్, వైర్లెస్ సెట్లు, స్కైప్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేయడంలో జఠ్ నైపుణ్యం సంపాదించాడు. 2012, అక్టోబర్‌లో జఠ్ తన సహచరులతో కలసి కశ్మీర్ లోయలోకి చొరబడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. లోయలో ఎన్నో ఉగ్రదాడులు, బ్యాంకు దొంగతనాల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు. -
బుఖారీ హత్య కేసు.. విస్తు గొలిపే విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ షుజాత్ బుఖారీ(52) హత్య కేసు దర్యాప్తులో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్ నుంచే హత్యకు ప్రణాళిక రచించారని తేల్చిన కశ్మీర్ పోలీసులు.. వ్యతిరేక ప్రచారమే బుఖారీ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇక నిందితుల్లో ఒకడు గతంలో శ్రీనగర్ జైలు నుంచి పారిపోయిన ఉగ్రవాది అని తేల్చారు. ఈ మేరకు పూర్తి వివరాలను ఐజీ స్వయం ప్రకాశ్ గురువారం మీడియాకు వెల్లడించారు. లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన నవీద్‌ను గతంలో బలగాలు చాకచక్యంగా బంధించాయి. ఈ ఫిబ్రవరిలో శ్రీనగర్ ఆస్పత్రి నుంచి నాటకీయ పరిణామాల మధ్య అతను తప్పించుకుని పారిపోయాడు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారితోపాటు కొందరు సిబ్బందిపై కూడా వేటు పడింది. అయితే తప్పించుకున్న నాలుగు నెలల తర్వాత నవీన్ బుఖారీ హత్యలో భాగస్వామి కావటం గమనార్హం. లష్కరే తోయిబాలో కీలకంగా వ్యవహరించిన సభ్యులే బుఖారీని హత్య చేశారని స్వయం ప్రకాశ్ వెల్లడించారు. లష్కరే తోయిబాకే చెందిన నవీద్ జాట్, ముజఫర్ అహ్మద్, ఆజాద్ మాలిక్ అనే ఉగ్రవాదులు ఈ ఘాతూకానికి పాల్పడినట్లు వెల్లడించారు. విద్వేషపూరిత ప్రచారం.. కశ్మీర్లో శాంతిని నెలకొల్పాలనే అంశంపై షుజాత్ బుఖారీ చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్నారు. శాంతి, భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక బుఖారీ హత్యకు ముందు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ప్రచారం జరిగింది. బహుశా ఈ విద్వేషపూరిత ప్రచారమే ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చు అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన కశ్మీరీ సాజద్ గుల్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్నారు. లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్న గుల్‌ను గతంలో పోలీసులు రెండుసార్లు అరెస్ట్ చేయగా, తప్పించుకుని దొంగ పాస్పోర్టుతో గతేడాది పాక్‌కు చేరుకున్నాడు. జూన్ 14వ తేదీన ఇఫ్తార్‌లో పాల్గొని వెళ్తున్న రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ బుఖారీని బైక్‌పై వచ్చిన ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. పోస్ట్ మార్టంలో బుఖారీ దేహం నుంచి 17 బుల్లెట్లను వైద్యులు వెలికి తీశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. -
పాక్‌లోనే బుఖారీ హత్యకు కుట్ర
శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందని కశ్మీర్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా బుఖారి హత్యకు పథకరచన చేసిందన్నారు. బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందనటానికి తమవద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు చెందిన నవీద్ జాట్, ముజఫర్ అహ్మద్, ఆజాద్ మాలిక్ అనే ఉగ్రవాదులు బుఖారీని తుపాకీతో కాల్చిచంపారని పానీ వెల్లడించారు. బుఖారీ హత్య జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్‌కు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైందని తెలిపారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన సాజద్ గుల్ ఈ ప్రచారానికి తెరలేపాడన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ప్రకారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలిందన్నారు. 2003, 2016లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి రెండు సార్లు అరెస్టయినప్పటికీ గుల్ అక్రమ మార్గాల్లో పాస్‌పోర్టును సంపాదించగలిగాడని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు వీలుగా నాన్‌బెయిలబుల్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని పానీ తెలిపారు. -
బుఖారీ హంతకుల్లో పాకిస్తానీ..!
శ్రీనగర్: కశ్మీర్లో శాంతి స్థాపన కోసం కృషి చేసిన ‘రైజింగ్ కశ్మీర్’ పత్రికాధిపతి, సీనియర్ జర్నలిస్టు షుజాత్ బుఖారీని కాల్చిచంపిన కేసులో కీలక మలుపు. బుఖారీపై కాల్పులు జరిపిన దుండగులను గుర్తించినట్లు పోలీసు వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుల్లో ఒకరు పాకిస్తాన్‌కు జావేద్ జట్గా గుర్తించామని డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక దరాప్తు బృందం తెలిపింది. జావేద్‌ను ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో సభ్యుడిగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులని గుర్తించామని దర్యాప్తు బృందం పేర్కొంది. కాగా, జావేద్ గతంలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని బృందం తెలిపింది. మరోవైపు గతంలో బుఖారిపై బ్లాగులో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్తానీని కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 14న ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి కారులో వెళ్తున్న బుఖారీపై బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. ఘటనలో బుఖారీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 15 ఏళ్లపాటు హిందూ పత్రికలో పనిచేసిన బుఖారీ, తర్వాత రైజింగ్ కశ్మీర్ పత్రికను నెలకొల్పారు. -
జర్నలిస్టులకు బీజేపీ లీడర్ వార్నింగ్
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : కథువా రేప్, హత్య కేసు గురించి గీత దాటి వార్తలు రాస్తున్నారని, అలా వార్తలు రాస్తున్న జర్నలిస్టులు వెటరన్ జర్నలిస్టు షుజాత్ బుఖారీ(కొద్దిరోజుల క్రితం షుజాత్ దారుణ హత్యకు గురయ్యారు)కి ఏం గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలని కశ్మీర్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు లాల్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన లాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లాల్ సింగ్ నోటి దురుసుతో ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. కథువా ఘటనలో నిందితుడి తరఫున జరిగిన ర్యాలీలో లాల్ సింగ్ పాల్గొన్నారు. కాగా, లాల్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కోరాలని కశ్మీర్ జర్నలిస్టులు నిర్ణయించారు. -
బుఖారి హత్యకేసులో ఒకరి అరెస్ట్
శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి(53) హత్యకేసులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్వయం ప్రకాశ్ పానీ మీడియాకు తెలిపారు. నిందితుడ్ని జుబైర్ ఖాద్రీగా గుర్తించినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల అనంతరం కారులో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారి నుంచి జుబైర్ తుపాకీని ఎత్తుకెళ్లాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీల్లో రికార్డయిందన్నారు. జుబైర్ నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు సెంట్రల్ కశ్మీర్ డీఐజీ వీకే విర్దీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పానీ పేర్కొన్నారు. మరోవైపు బారాముల్లా జిల్లాలోని స్వగ్రామంలో బుఖారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. అధికార పీడీపీ, బీజేపీ మంత్రులు, ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా బుఖారి అంత్యక్రియలకు హాజరయ్యారు. -
సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. పిస్టల్‌తో కాల్పులు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులు, నాలుగో నిందితుడిని గుర్తించారు. నాలుగో నిందితుడి ఫోటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫోటోలను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిగాక, ఆయన బాడీ గార్డును కారు నుంచి పక్కకు తీసి, బుఖారికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. మరోసారి పిస్టల్‌తో కాల్పులు జరిపినట్టు తెలిసింది. పిస్టల్‌తో కాల్చిన అనంతరం వెంటనే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతను తెల్లని కుర్తా ధరించి, గడ్డెంతో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనుమానితుల ఫొటోలను విడుదల చేయడం ద్వారా స్థానికుల సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు సంబంధించిన సమాచారం అందించిన పౌరుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించిన వీరు, గురువారం బుఖారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొక సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా.. ఆయన కూడా మరణించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చాక బుఖారిపై దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. బుఖారి అంత్య క్రియలు నేడు ఆయన పూర్వీకుల గ్రామం బారాముల్లాలోని క్రీరిలో జరిగాయి. జోరుగా వర్షం పడుతున్నప్పటికీ, స్నేహితులు, కొలీగ్స్, ఆ గ్రామ వాసులు పెద్ద ఎత్తున్న ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
శ్రీనగర్: సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్య