శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందని కశ్మీర్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా బుఖారి హత్యకు పథకరచన చేసిందన్నారు. బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందనటానికి తమవద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు చెందిన నవీద్ జాట్, ముజఫర్ అహ్మద్, ఆజాద్ మాలిక్ అనే ఉగ్రవాదులు బుఖారీని తుపాకీతో కాల్చిచంపారని పానీ వెల్లడించారు.
బుఖారీ హత్య జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్‌కు చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైందని తెలిపారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన సాజద్ గుల్ ఈ ప్రచారానికి తెరలేపాడన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ప్రకారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలిందన్నారు. 2003, 2016లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి రెండు సార్లు అరెస్టయినప్పటికీ గుల్ అక్రమ మార్గాల్లో పాస్‌పోర్టును సంపాదించగలిగాడని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు వీలుగా నాన్‌బెయిలబుల్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని పానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment