మంగళవారం షాపు తెరిచాడని ఘర్షణ
బెంగళూరు: మంగళవారం పూట బార్బర్ షాపు తెరిచాడనే ఆవేశంతో ఓ ముస్లిం షాపు యజమానిపై దాడిచేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళూరుకు సమీపంలోని నెల్లివాడి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు నాయకులు, మూకుమ్మడిగా షాపు యజమాని సల్మాన్ పై దాడి చేశారు. షాపులను ధ్వంసం చేశారు. దీంతో ముస్లిం, విశ్వహిందూ పరిషత్ కు చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. ఉదయ్ కుమార్, బాలయ్య ఆధ్వర్యంలో సల్మాన్ పై దాడి చేశారు. దీంతో పాటు స్థానిక మసీద్ పై దాడికి దిగారు. దీనికి ప్రతిగా మరో గ్రూపు ఎదురు దాడికి పూనుకుంది.
స్థానిక ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసినందుకు సల్మాన్ పై దాడి చేసినట్టుగా భజరగ్ దళ్ నాయకుడు రవి బాలయ్య తన వైఖరిని సమర్ధించుకున్నారు. హిందువులు మంగళవారం క్షవరం చేయించుకోరనే సంగతి అందరికీ తెలుసన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ పనికి పూనుకున్నారని ఆరోపించారు. అటు వీరి ఆరోపణలు తిప్పికొట్టిన ముస్లిం నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఒక పథకం ప్రకారం భజరంగ్ దళ్ నేతలు ముస్లింలపై దాడి దిగారని స్థానిక మసీదు పెద్ద ఆరోపించారు. యువతను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారన్నారు.
ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ మతఘర్షణలో లక్షల రూపాయల ఆస్తి ధ్వంసమైంది. పలువురుకి గాయాలయ్యాయి. వివాదాన్ని చక్కదిద్దేందుకు పోలీసులు కర్ఫూ విధించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు.