Shweta Varma
-
Pachchis Movie: ‘పచ్చీస్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘పచ్చీస్’ తారాగణం: రామ్స్, శ్వేతావర్మ సంగీతం: స్మరణ్; కెమెరా: కార్తీక్ పర్మార్ నిర్మాతలు: కౌశిక్, రామసాయి దర్శకత్వం: శ్రీకృష్ణ, రామ సాయి ఓటీటీ: అమెజాన్ కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్లతో థియేటర్లు మూసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు చూపంతా ఓటీటీల పైనే! వరుసగా బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు ఏదో ఒక ఓటీటీలో వస్తున్నాయి. ఖాళీ ఉంటే కాలం ఖర్చు చేయడానికి ఓకే కానీ, వీటిలో క్వాలిటీవి ఎన్ని వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలెన్నో రేకెత్తిస్తుంది – లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ ‘పచ్చీస్’. కథేమిటంటే..: కలవారి బిడ్డ అయినా ఈజీ మనీకి అలవాటు పడి, గ్యాంబ్లింగ్‌లో తిరిగే కుర్రాడు అభిరామ్ (రామ్స్). ఎలాగోలా డబ్బు సంపాదించాలనే కాంక్షతో అనేక అబద్ధాలతో, అడ్డదోవలు తొక్కుతుంటాడు. జీవితాన్ని జూదంగా నడిపేస్తుంటాడు. అదే సమయంలో రాజకీయ నాయకులైన గంగాధర్ (‘శుభలేఖ’ సుధాకర్), బసవరాజు (విశ్వేందర్ రెడ్డి) మధ్య ఆధిపత్యం కోసం పోరాటం సాగుతుంటుంది. బెట్టింగ్‌లో ఓడిపోయిన లక్షల కొద్దీ డబ్బు కోసం బసవరాజును ఆశ్రయిస్తాడీ కుర్రాడు. రాజకీయ నేతల మధ్య గొడవలో డబ్బు కొట్టేసి, దాంతో పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలోనే కనిపించకుండా పోయిన అన్న కోసం వెతికే చెల్లెలు అవంతి (శ్వేతావర్మ) ఎదురవుతుంది. అక్కడ నుంచి సవాలక్ష మలుపులు, మరిన్ని పాత్రల మధ్య ఈ జూదం ఏమై, ఎవరి పచ్చీస్ (పాచికలు) పారి, చివరికి ఏమైందన్నది సుదీర్ఘమనిపించే 2 గంటల పైగా నిడివి సిన్మా. ఎలా చేశారంటే..: నాగార్జున, విజయ్ దేవరకొండ, రామ్, రానా, అడివి శేషు – ఇలా తెలుగు సినీ తారలెందరికో ఫ్యాషన్ డిజైనరైన భీమవరం కుర్రాడు రామ్స్ ఇందులో జులాయి కుర్రాడిగా, మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటేసుకొని కనిపిస్తారు. నటనలో ఈజ్ ఉన్నా, రాసిన పాత్రలో దమ్ము లేకపోవడం లోపమైంది. కొద్ది వారాలుగా కనిపించని అన్నయ్య కోసం వెతికే చెల్లెలి పాత్రలో, తానే ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా ప్రవర్తిస్తుంటారు శ్వేతావర్మ. ఆ పాత్రకూ తీరూతెన్నూ కష్టపడి వెతుక్కోవాల్సి ఉంటుంది. సొంత పవర్ ప్రాజెక్ట్ కోసం శ్రమించే పొలిటీషియన్‌గా ‘శుభలేఖ’ సుధాకర్ ఉన్నంతలో బాగా చేశారు. జయ్‌చంద్ర, క్యాసినో ఓనర్ > రవివర్మ సహా ఇంకా చాలామంది ఉన్నారు. అయితే, చిట్టి పొట్టి మాటల డైలాగులతో లేనిపోని ఉద్విగ్నత రేపాలనే రచనా లోపం భావోద్వేగ నటనకు తావు లేకుండా చేసిందనిపిస్తుంది. ఎలా తీశారంటే..: ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టే ఇదో క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ చిత్రం అని ప్రకటించారు. కానీ, సస్పెన్స్ మాటెలా ఉన్నా... బోలెడంత గందరగోళం కథలో, కథనంలో మూటగట్టుకున్న చిత్రం ఇది. ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలొస్తూ పోతుంటాయి. దేనికీ ప్రాధాన్యం ఉండదు. ప్రతి పాత్రా ఏదో ఫిలాసఫీనో, గంభీరమైన విషయమో చెబుతున్నట్టు మాట్లాడుతుంది. పైగా, ఎక్కడో జరిగే ఏవో విషయాలూ జైలులో ఉన్నవాళ్ళతో సహా అన్ని పాత్రలకూ తెలిసిపోతుంటాయి. పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడానికే దాదాపు సగం సినిమా గడిచిపోతుంది. అలాగే ప్రధాన పాత్రధారి ఒక చోట ఓ పోలీసాఫీసర్‌తో ‘‘ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే ఫీలింగూ అదే. అభిరామ్ పాత్రను జులాయిలా చూపించారు. కాసేపేమో జర్నలిస్టు అని డైలాగుల్లో అనిపిస్తారు. ఇక, చివరలో వచ్చే పోలీసాఫీసర్ శంకర్ (దయానంద్ రెడ్డి) పాత్రలైతే, పోలీసు పని కాకుండా, నిందితుల వైపు నిలబడినట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నా... నోరెళ్ళబెట్టుకొని పోలీసులు చూస్తున్నట్టనిపిస్తుంది. సినిమా అంతా అభిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినట్టు అనిపించి, చివరకు వచ్చేసరికి వేరెవరికో ఇన్వెస్టిగేషన్ క్రెడిట్ ఇవ్వడం కూడా వీక్షకులు జీర్ణించుకోలేరు. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లో డార్క్‌గా కనిపించే ఈ సినిమాలో కెమేరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంటాయి. పాటలేమీ లేవన్న మాటే కానీ, ఆ లోటేమీ పెద్దగా ఫీల్ కాము. ఎడిటర్ తన కత్తెర పదును చూపితే, రచన – దర్శకత్వ లోపాలు కొన్నయినా కవరయ్యేవి. ‘‘ముగించలేనిది ఎప్పుడూ మొదలుపెట్టద్దు’’ అని ఇందులో ఓ పాత్ర అంటుంది. బహుశా, ఆ విషయం ఈ దర్శక, రచయితలకూ వర్తిస్తుంది. కథాకథనాన్ని సరిగ్గా మొదలుపెట్టలేకపోవడంతో పాటు ముగింపూ చేయలేదనిపిస్తుంది. కంటెంట్ లేని సీన్లు సవాలక్ష వచ్చిపోయే నేపథ్యంలో... పాత్రలతో పాటు ప్రేక్షకులనూ కన్ఫ్యూజ్ చేస్తుంది. కొసమెరుపు: ఫాస్ట్ ఫార్వర్డ్లోనూ ముందుకెళ్ళని స్లో నేరేషన్ – ప... ప... ఛీ.. ఛీ...స్. – రెంటాల జయదేవ -
హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్ దేశపతి, మోహన్, నితిన్నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూపించాం. సినిమా చూసినవారంతా హాలీవుడ్ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నివాస్. -
విడుదలకు ముందే విజయం!
ఓ పెళ్లి చూపులు, ఓ ఉయ్యాలా జంపాలా... కొత్తవాళ్లతో తీసినా సినిమా బాగుంటే ప్రేక్షకాదరణ ఉంటుందనీ, ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని నిరూపించాయి. ఈ నమ్మకంతోనే ఐఐటి గ్రాడ్యుయేట్ చల్లా శ్రీకాంత్ ‘వశం’ తీశారు. ఓ రకంగా విడుదలకు ముందే ఈ సినిమా విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే... విడుదలకు ముందే సగం స్క్రిప్టును ఆన్లైన్లో పెడితే బోలెడు ప్రశంసలు. ఇంకొకటి... ఈ సినిమాకు సుమారు 120 మంది నిర్మాతలు. అంటే... క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అన్నమాట. ‘అంతమందికి కథ నచ్చి, తమ డబ్బులు ఇన్వెస్ట్ చేశారంటే... ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుంది కదా!’ అంటున్నారు చల్లా శ్రీకాంత్. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి ఆయన చెప్పిన సంగతులు.... ⇒ ఐఐటి చదువు నా ఆలోచనా విధానాన్ని మార్చింది. ఐఐటిలో ఉన్నప్పుడు ‘కర్తవ్య’ అనే డాక్యుమెంటరీ చేశా. తర్వాత రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశా. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఐబీయమ్లో జాబ్ చేశా. సినిమాలపై ఆసక్తితో జాబ్ మానేసి హిందీ–ఇంగ్లీష్ ఫిల్మ్ ‘సాంగ్ ఆఫ్ లైఫ్’ తీశా. తెలుగులో ‘మిణుగురులు’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేశా. సురేశ్ ప్రొడక్షన్స్‌లో కొన్నాళ్లు, ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’కు కో–రైటర్‌గా వర్క్ చేశా. ‘వశం’తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నా. ⇒ భయం లేదు.. భక్తి లేదు... ఓ వ్యక్తిని కంట్రోల్ చేసే పవర్ మనుషులకు వస్తే ఏం జరుగుతుంది? ఎదుటివ్యక్తిని మనం వశపరుచుకోగలిగితే ఏం చేయొచ్చు? అనే కథతో రూపొందిన చిత్రమిది. రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్ వెలిగించొచ్చని చెబితే మేజిక్ అనేవారు. ఇప్పుడలాగే పర్టిక్యులర్ యోగా, విభిన్నమైన సంగీతం, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్ చేయొచ్చని చెబితే మేజిక్ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు... నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. అది సాధ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ. ⇒ ఈ కథ చదివిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అంతే కాదు... రెండు నెలలు సెలవు పెట్టి మాకోసం వర్క్ చేయడానికొచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఫిల్మ్ మేకింగ్ అంటే... సరైన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడమే. ఆ విషయంలో నేను లక్కీ. ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, నిర్మాతలు దొరికారు. ⇒ హిందీ హిట్ ‘యే దిల్ హై ముష్కిల్’కు అనిల్ మెహతా (సినిమాటోగ్రాఫర్) బృందంలో చేసిన దుర్గా కిశోర్ మా సిన్మాకు సినిమాటోగ్రాఫర్. ఆయన్ను ‘వశం’కు తీసుకోవడం ఓ మిరాకిలే. ఆయనోసారి నాకు మెసేజ్ చేశారు. మళ్లీ ఇంకోసారి మెసేజ్ చేసినప్పుడు కలిశా. దుర్గాకిశోర్ షో రీల్స్ చూపించినప్పుడు ‘ఆయన గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు’ అని ఆశ్చర్యపోయా. అప్పుడే ఆయన అనిల్ మెహతా దగ్గర వర్క్ చేశారని తెలుసుకున్నా. నలభై రోజుల్లో మా సినిమాను కంప్లీట్ చేశాం. మాది ఓ చిన్న సిన్మా, లో బడ్జెట్ మూవీ అనే ఫీల్ ఎక్కడా రాకుండా చాలా రిచ్ లుక్‌తో తీశారాయన. ‘వశం’ పూర్తయిన తర్వాత ఇరానియన్ ఫిల్మ్ మేకర్ మాజిద్ మాజిది ‘బియాండ్ ద క్లౌడ్స్’కు దుర్గాకిశోర్ వర్క్ చేస్తున్నారు. ⇒ సిన్మాకు కీలకమైన పాత్రలో ‘చందమామ కథలు’లో బిచ్చగాడిగా నటించిన కృష్ణేశ్వరరావు, వాసుదేవ్ రావు, శ్వేతా వర్మ, నందకిశోర్... ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సినిమాలో ఒక్కటే పాట ఉంది. చక్రవర్తుల కిరణ్ రాసిన ఆ పాటను జోస్యభట్ల శర్మగారు స్వరపరిచారు. ఆయన చేసిన రీ–రికార్డింగ్ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. సరికొత్త కథతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా. -
ఆ పవర్ మనుషులకొస్తే...
‘‘శాస్త్రవేత్త లేదా తత్వవేత్తల గమ్యం ఒక్కటే. సైన్స్, ఫిలాసఫీ ఒకదానితో అనుసంధానమై ఉన్నాయి’’ అన్నారు చల్లా శ్రీకాంత్. ఆయన దర్శకత్వంలో ఐఐటి ఐఎస్ఎమ్డి, ఐఐఎమ్బిలలో చదివిన పలువురు విద్యార్థులు కలసి నిర్మించిన (క్రౌడ్ ఫండెడ్) సినిమా ‘వశం’. వాసుదేవ్ రావు, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ సినిమాను వచ్చే నెల 4న విడుదల చేయాలనుకుంటున్నారు. చల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఏం చేయకుండా ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేసే పవర్ మనకు వస్తే... వశపరుచుకో గలిగితే ఏం చేయొచ్చు? అనేది చిత్రకథ. ఉదాహరణకు... రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్ వెలిగించొచ్చని చెబితే మేజిక్ అనేవారు. అలాగే, ఇప్పుడు పర్టిక్యులర్ యోగాతో, సంగీతంతో, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్ చేయొచ్చని చెబితే మేజిక్ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు... నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. ఈ చిత్రం పోస్టర్‌ను శ్రీకాంత్, ‘అల్లరి’ నరేశ్ గార్లు ఆవిష్కరించారు. ట్రైలర్ కూడా చూసి, అభినందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: రోహిత్ మిశ్రా, స్క్రీన్‌ప్లే: రోహిత్ మిశ్రా–చల్లా శ్రీకాంత్, కెమెరా: దుర్గా కిశోర్, సంగీతం: జోశ్యభట్ల శర్మ.