విడుదలకు ముందే విజయం! | vasham film is getting released tomorrow | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే విజయం!

Published Wed, Aug 2 2017 11:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

విడుదలకు ముందే విజయం!

విడుదలకు ముందే విజయం!

ఓ పెళ్లి చూపులు, ఓ ఉయ్యాలా జంపాలా... కొత్తవాళ్లతో తీసినా సినిమా బాగుంటే ప్రేక్షకాదరణ ఉంటుందనీ, ‘కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌’ అని నిరూపించాయి. ఈ నమ్మకంతోనే ఐఐటి గ్రాడ్యుయేట్‌ చల్లా శ్రీకాంత్‌ ‘వశం’ తీశారు. ఓ రకంగా విడుదలకు ముందే ఈ సినిమా విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే... విడుదలకు ముందే సగం స్క్రిప్టును ఆన్‌లైన్‌లో పెడితే బోలెడు ప్రశంసలు. ఇంకొకటి... ఈ సినిమాకు సుమారు 120 మంది నిర్మాతలు. అంటే... క్రౌడ్‌ ఫండెడ్‌ ఫిల్మ్‌ అన్నమాట. ‘అంతమందికి కథ నచ్చి, తమ డబ్బులు ఇన్వెస్ట్‌ చేశారంటే... ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుంది కదా!’ అంటున్నారు చల్లా శ్రీకాంత్‌. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి ఆయన చెప్పిన సంగతులు....

ఐఐటి చదువు నా ఆలోచనా విధానాన్ని మార్చింది. ఐఐటిలో ఉన్నప్పుడు ‘కర్తవ్య’ అనే డాక్యుమెంటరీ చేశా. తర్వాత రెండు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా. ఐఐటిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత ఐబీయమ్‌లో జాబ్‌ చేశా. సినిమాలపై ఆసక్తితో జాబ్‌ మానేసి హిందీ–ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ‘సాంగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ తీశా. తెలుగులో ‘మిణుగురులు’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ చేశా. సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో కొన్నాళ్లు, ప్రవీణ్‌ సత్తారు ‘చందమామ కథలు’కు కో–రైటర్‌గా వర్క్‌ చేశా. ‘వశం’తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నా.    

భయం లేదు.. భక్తి లేదు... ఓ వ్యక్తిని కంట్రోల్‌ చేసే పవర్‌ మనుషులకు వస్తే ఏం జరుగుతుంది? ఎదుటివ్యక్తిని మనం వశపరుచుకోగలిగితే ఏం చేయొచ్చు? అనే కథతో రూపొందిన చిత్రమిది. రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్‌ వెలిగించొచ్చని చెబితే మేజిక్‌ అనేవారు. ఇప్పుడలాగే పర్టిక్యులర్‌ యోగా, విభిన్నమైన సంగీతం, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్‌ చేయొచ్చని చెబితే మేజిక్‌ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు... నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. అది సాధ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ.

ఈ కథ చదివిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కొంత అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేశారు. అంతే కాదు... రెండు నెలలు సెలవు పెట్టి మాకోసం వర్క్‌ చేయడానికొచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఫిల్మ్‌ మేకింగ్‌ అంటే... సరైన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడమే. ఆ విషయంలో నేను లక్కీ. ప్యాషన్‌ ఉన్న ఆర్టిస్టులు, నిర్మాతలు దొరికారు.

హిందీ హిట్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’కు అనిల్‌ మెహతా (సినిమాటోగ్రాఫర్‌) బృందంలో చేసిన దుర్గా కిశోర్‌ మా సిన్మాకు సినిమాటోగ్రాఫర్‌. ఆయన్ను ‘వశం’కు తీసుకోవడం ఓ మిరాకిలే. ఆయనోసారి నాకు మెసేజ్‌ చేశారు. మళ్లీ ఇంకోసారి మెసేజ్‌ చేసినప్పుడు కలిశా. దుర్గాకిశోర్‌ షో రీల్స్‌ చూపించినప్పుడు ‘ఆయన గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు’ అని ఆశ్చర్యపోయా. అప్పుడే ఆయన అనిల్‌ మెహతా దగ్గర వర్క్‌ చేశారని తెలుసుకున్నా. నలభై రోజుల్లో మా సినిమాను కంప్లీట్‌ చేశాం. మాది ఓ చిన్న సిన్మా, లో బడ్జెట్‌ మూవీ అనే ఫీల్‌ ఎక్కడా రాకుండా చాలా రిచ్‌ లుక్‌తో తీశారాయన. ‘వశం’ పూర్తయిన తర్వాత ఇరానియన్‌ ఫిల్మ్‌ మేకర్‌ మాజిద్‌ మాజిది ‘బియాండ్‌ ద క్లౌడ్స్‌’కు దుర్గాకిశోర్‌ వర్క్‌ చేస్తున్నారు.

సిన్మాకు కీలకమైన పాత్రలో ‘చందమామ కథలు’లో బిచ్చగాడిగా నటించిన కృష్ణేశ్వరరావు, వాసుదేవ్‌ రావు, శ్వేతా వర్మ, నందకిశోర్‌... ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సినిమాలో ఒక్కటే పాట ఉంది. చక్రవర్తుల కిరణ్‌ రాసిన ఆ పాటను జోస్యభట్ల శర్మగారు స్వరపరిచారు. ఆయన చేసిన రీ–రికార్డింగ్‌ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. సరికొత్త కథతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement