Nandkishore
-
వైఎస్ జగన్ చెప్పిందే నిజమైంది
-
జగన్ చెప్పిందే నిజమైంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో అక్షరాలా అదే నిజమని తేలింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక సంఘం అనుమతి అక్కర లేదని, అసలు హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని, ప్రధానమంత్రి సంతకంతో ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కార్యనిర్వాహక ఆదేశం) ద్వారా చేయవచ్చని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా పదేపదే చెబుతున్న అంశం వాస్తవమని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిషోర్‌సింగ్ గురువారం అమరావతి సాక్షిగా హోదాపై చేసిన ప్రకటనతో తేటతెల్లం అయింది. నందకిషోర్‌సింగ్ ప్రత్యేక హోదాతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. (చదవండి: ప్రత్యేక హోదా మా పరిధి కాదు) ఇది పూర్తిగా జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని, అమలు చేసే బాధ్యత ప్లానింగ్ కమిషన్‌దని తేల్చి చెప్పారు. 14వ ఆర్థికసంఘం ప్రత్యేక హోదాను అడ్డుకుందని చెప్పడం కూడా నిజం కాదన్నారు. అంతేకాదు ఆయన మరో అడుగు ముందుకేసి అసలు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తాను భావించడం లేదని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. నందకిషోర్‌సింగ్ అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. నాడు నేనూ సభలోనే ఉన్నా.. రాష్ట్ర విభజన చట్టం ఆమోదించేటప్పుడు తాను కూడా రాజ్యసభలోనే ఉన్నానని.. అప్పుడు తాను చప్పట్లు కొట్టానని, తనతోపాటు ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా చప్పట్లు కొట్టారని నందకిషోర్‌సింగ్ వెల్లడించారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు విభజన హామీల అమలుకు ఒక వ్యవస్థీకృతమైన పర్యవేక్షక యంత్రాంగం ఉండేదని, ఏపీ విషయంలో విచిత్రంగా అలాంటి దాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కనుక ఇచ్చేది ఉంటే విభజన సమయంలోనే ఇచ్చి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక సంఘం ప్రమేయం ఈ విషయంలో అవసరం లేదని స్పష్టం చేశారు. అసలు ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలోని అధ్యయన, పరిశీలనాంశాల్లోకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, పాక్షికంగా గానీ, కనీసం సుదూరం నుంచి కూడా ప్రభావితం చేసే విధంగా గానీ (రిమోట్) రాదని చెప్పారు. నాలుగేళ్లు నిమ్మకునీరెత్తినట్లున్న బాబు ప్రత్యేక హోదాతో ఆర్థిక సంఘానికి ఎలాంటి ప్రమేయం గానీ, సంబంధం గానీ ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని గట్టిగా పోరాడి సాధించే బదులు చంద్రబాబు కేంద్రానికి దాసోహం కావడంతో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం జరిగింది. ప్రత్యేక హోదాపై ఏ మాత్రం పట్టు వీడకుండా జగన్ రాజీలేని పోరాటం చేస్తూ రావడం, ద్రోహం జరిగిందని తెలుసుకున్న ప్రజలు హోదా కోసం తీవ్ర స్థాయిలో ప్రజలు ఉద్యమించడంతో చివరకు చంద్రబాబు ఈ విషయంలో ‘యూటర్న్’ తీసుకోక తప్పలేదు. నాలుగేళ్లకుపైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని అనుభవించి, హోదా సాధించే సువర్ణావకాశాన్ని జారవిడిచి ఇపుడు ఎన్నికలకు ఆరునెలల ముందు చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షల మర్మాన్ని, మోసాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని విశ్లేషకులంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి కాపురం చేసిన చంద్రబాబుగానీ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు గానీ ఏరోజూ ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదు. ఈ విషయమై జగన్ అటు అసెంబ్లీలోనూ, బయటా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తే... మీకేం తెలుసని చంద్రబాబుతో సహా మంత్రులంతా అవహేళన చేస్తూ మాట్లాడారే తప్ప అందులోని వాస్తవాలు గ్రహించలేక పోయారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వాస్తవాలను వెల్లడించడంతో ఇన్నాళ్లూ జగన్ చెబుతూ వచ్చిందే నిజమన్న సంగతి స్పష్టంగా తేలిపోయింది. అయితే ప్రత్యేక హోదాకు అడ్డు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులేనంటూ నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని మరుగున ఉంచి ఇపుడు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పిన మాటలను తాము ముందే చెప్పామన్నట్లుగా టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్, సీఎం చంద్రబాబుకూ మధ్య పలు మార్లు ప్రత్యేక హోదా విషయంలో వాదోపవాదాలు జరిగినా 2017, మార్చి 17వ తేదీన ఇద్దరికీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అప్పుడు ఎవరేమన్నారో ఈ క్లిప్పింగ్‌లో చూడవచ్చు. -
విడుదలకు ముందే విజయం!
ఓ పెళ్లి చూపులు, ఓ ఉయ్యాలా జంపాలా... కొత్తవాళ్లతో తీసినా సినిమా బాగుంటే ప్రేక్షకాదరణ ఉంటుందనీ, ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని నిరూపించాయి. ఈ నమ్మకంతోనే ఐఐటి గ్రాడ్యుయేట్ చల్లా శ్రీకాంత్ ‘వశం’ తీశారు. ఓ రకంగా విడుదలకు ముందే ఈ సినిమా విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే... విడుదలకు ముందే సగం స్క్రిప్టును ఆన్లైన్లో పెడితే బోలెడు ప్రశంసలు. ఇంకొకటి... ఈ సినిమాకు సుమారు 120 మంది నిర్మాతలు. అంటే... క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అన్నమాట. ‘అంతమందికి కథ నచ్చి, తమ డబ్బులు ఇన్వెస్ట్ చేశారంటే... ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుంది కదా!’ అంటున్నారు చల్లా శ్రీకాంత్. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి ఆయన చెప్పిన సంగతులు.... ⇒ ఐఐటి చదువు నా ఆలోచనా విధానాన్ని మార్చింది. ఐఐటిలో ఉన్నప్పుడు ‘కర్తవ్య’ అనే డాక్యుమెంటరీ చేశా. తర్వాత రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశా. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఐబీయమ్లో జాబ్ చేశా. సినిమాలపై ఆసక్తితో జాబ్ మానేసి హిందీ–ఇంగ్లీష్ ఫిల్మ్ ‘సాంగ్ ఆఫ్ లైఫ్’ తీశా. తెలుగులో ‘మిణుగురులు’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేశా. సురేశ్ ప్రొడక్షన్స్‌లో కొన్నాళ్లు, ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’కు కో–రైటర్‌గా వర్క్ చేశా. ‘వశం’తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నా. ⇒ భయం లేదు.. భక్తి లేదు... ఓ వ్యక్తిని కంట్రోల్ చేసే పవర్ మనుషులకు వస్తే ఏం జరుగుతుంది? ఎదుటివ్యక్తిని మనం వశపరుచుకోగలిగితే ఏం చేయొచ్చు? అనే కథతో రూపొందిన చిత్రమిది. రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్ వెలిగించొచ్చని చెబితే మేజిక్ అనేవారు. ఇప్పుడలాగే పర్టిక్యులర్ యోగా, విభిన్నమైన సంగీతం, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్ చేయొచ్చని చెబితే మేజిక్ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు... నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. అది సాధ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ. ⇒ ఈ కథ చదివిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అంతే కాదు... రెండు నెలలు సెలవు పెట్టి మాకోసం వర్క్ చేయడానికొచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఫిల్మ్ మేకింగ్ అంటే... సరైన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడమే. ఆ విషయంలో నేను లక్కీ. ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు, నిర్మాతలు దొరికారు. ⇒ హిందీ హిట్ ‘యే దిల్ హై ముష్కిల్’కు అనిల్ మెహతా (సినిమాటోగ్రాఫర్) బృందంలో చేసిన దుర్గా కిశోర్ మా సిన్మాకు సినిమాటోగ్రాఫర్. ఆయన్ను ‘వశం’కు తీసుకోవడం ఓ మిరాకిలే. ఆయనోసారి నాకు మెసేజ్ చేశారు. మళ్లీ ఇంకోసారి మెసేజ్ చేసినప్పుడు కలిశా. దుర్గాకిశోర్ షో రీల్స్ చూపించినప్పుడు ‘ఆయన గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు’ అని ఆశ్చర్యపోయా. అప్పుడే ఆయన అనిల్ మెహతా దగ్గర వర్క్ చేశారని తెలుసుకున్నా. నలభై రోజుల్లో మా సినిమాను కంప్లీట్ చేశాం. మాది ఓ చిన్న సిన్మా, లో బడ్జెట్ మూవీ అనే ఫీల్ ఎక్కడా రాకుండా చాలా రిచ్ లుక్‌తో తీశారాయన. ‘వశం’ పూర్తయిన తర్వాత ఇరానియన్ ఫిల్మ్ మేకర్ మాజిద్ మాజిది ‘బియాండ్ ద క్లౌడ్స్’కు దుర్గాకిశోర్ వర్క్ చేస్తున్నారు. ⇒ సిన్మాకు కీలకమైన పాత్రలో ‘చందమామ కథలు’లో బిచ్చగాడిగా నటించిన కృష్ణేశ్వరరావు, వాసుదేవ్ రావు, శ్వేతా వర్మ, నందకిశోర్... ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సినిమాలో ఒక్కటే పాట ఉంది. చక్రవర్తుల కిరణ్ రాసిన ఆ పాటను జోస్యభట్ల శర్మగారు స్వరపరిచారు. ఆయన చేసిన రీ–రికార్డింగ్ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. సరికొత్త కథతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా. -
గూగుల్‌పై కేసు
► అభ్యంతర జాబితాలో మోదీ పేరు షాజహాన్‌పూర్ (యూపీ): ప్రధాని మోదీ పేరును 2015లో అభ్యంతరకరమైన జాబితాలో చేర్చి ఫలితాలు అందించినందుకు ఆన్లైన్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌పై కేసు నమోదైంది. నంద్కిషోర్ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నగర ఎస్పీ కమల్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఈ విషయమై నంద్కిషోర్ మాట్లాడుతూ, తాను 2015లో గూగుల్‌లో జాతీయ వార్తల్ని సెర్చ్ చేస్తుండగా ప్రధాని మోదీ పేరును అభ్యంతరకరమైన జాబితాలో సదరు సంస్థ చేర్చిందని ఆరోపించారు. దీంతో తనతో పాటు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. -
ప్రేమించి.. పెళ్లి చేసుకో..!
ప్రేమ, పెళ్లి అనేవాటికి రానురాను విలువ తగ్గిపోతోంది. వాటి విశిష్టతను తెలియజేస్తూ రూపొందిన చిత్రం ‘అగ్ని సాక్షిగా..పెళ్లాడండి’. విసురెడ్డి, ఇషా, నందకిషోర్,త్రివేణి ముఖ్యతారలుగా ఆర్.ఆర్ జరుగుల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమించిన అమ్మాయిని అగ్నిసాక్షిగా పెళ్లాడండి అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పామని దర్శక నిర్మాత ఆర్.ఆర్ జరుగుల తెలిపారు ఈ చిత్రానికి సంగీతం: వంశీ, గణేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గొట్టిపాటి కోటేశ్వరరావు.