సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో అక్షరాలా అదే నిజమని తేలింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక సంఘం అనుమతి అక్కర లేదని, అసలు హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని, ప్రధానమంత్రి సంతకంతో ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కార్యనిర్వాహక ఆదేశం) ద్వారా చేయవచ్చని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా పదేపదే చెబుతున్న అంశం వాస్తవమని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిషోర్‌సింగ్ గురువారం అమరావతి సాక్షిగా హోదాపై చేసిన ప్రకటనతో తేటతెల్లం అయింది. నందకిషోర్‌సింగ్ ప్రత్యేక హోదాతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. (చదవండి: ప్రత్యేక హోదా మా పరిధి కాదు)
ఇది పూర్తిగా జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని, అమలు చేసే బాధ్యత ప్లానింగ్ కమిషన్‌దని తేల్చి చెప్పారు. 14వ ఆర్థికసంఘం ప్రత్యేక హోదాను అడ్డుకుందని చెప్పడం కూడా నిజం కాదన్నారు. అంతేకాదు ఆయన మరో అడుగు ముందుకేసి అసలు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తాను భావించడం లేదని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. నందకిషోర్‌సింగ్ అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
నాడు నేనూ సభలోనే ఉన్నా..
రాష్ట్ర విభజన చట్టం ఆమోదించేటప్పుడు తాను కూడా రాజ్యసభలోనే ఉన్నానని.. అప్పుడు తాను చప్పట్లు కొట్టానని, తనతోపాటు ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా చప్పట్లు కొట్టారని నందకిషోర్‌సింగ్ వెల్లడించారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు విభజన హామీల అమలుకు ఒక వ్యవస్థీకృతమైన పర్యవేక్షక యంత్రాంగం ఉండేదని, ఏపీ విషయంలో విచిత్రంగా అలాంటి దాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కనుక ఇచ్చేది ఉంటే విభజన సమయంలోనే ఇచ్చి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక సంఘం ప్రమేయం ఈ విషయంలో అవసరం లేదని స్పష్టం చేశారు. అసలు ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలోని అధ్యయన, పరిశీలనాంశాల్లోకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, పాక్షికంగా గానీ, కనీసం సుదూరం నుంచి కూడా ప్రభావితం చేసే విధంగా గానీ (రిమోట్) రాదని చెప్పారు.
నాలుగేళ్లు నిమ్మకునీరెత్తినట్లున్న బాబు
ప్రత్యేక హోదాతో ఆర్థిక సంఘానికి ఎలాంటి ప్రమేయం గానీ, సంబంధం గానీ ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని గట్టిగా పోరాడి సాధించే బదులు చంద్రబాబు కేంద్రానికి దాసోహం కావడంతో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం జరిగింది. ప్రత్యేక హోదాపై ఏ మాత్రం పట్టు వీడకుండా జగన్ రాజీలేని పోరాటం చేస్తూ రావడం, ద్రోహం జరిగిందని తెలుసుకున్న ప్రజలు హోదా కోసం తీవ్ర స్థాయిలో ప్రజలు ఉద్యమించడంతో చివరకు చంద్రబాబు ఈ విషయంలో ‘యూటర్న్’ తీసుకోక తప్పలేదు.
నాలుగేళ్లకుపైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని అనుభవించి, హోదా సాధించే సువర్ణావకాశాన్ని జారవిడిచి ఇపుడు ఎన్నికలకు ఆరునెలల ముందు చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షల మర్మాన్ని, మోసాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని విశ్లేషకులంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి కాపురం చేసిన చంద్రబాబుగానీ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు గానీ ఏరోజూ ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదు.
ఈ విషయమై జగన్ అటు అసెంబ్లీలోనూ, బయటా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తే... మీకేం తెలుసని చంద్రబాబుతో సహా మంత్రులంతా అవహేళన చేస్తూ మాట్లాడారే తప్ప అందులోని వాస్తవాలు గ్రహించలేక పోయారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వాస్తవాలను వెల్లడించడంతో ఇన్నాళ్లూ జగన్ చెబుతూ వచ్చిందే నిజమన్న సంగతి స్పష్టంగా తేలిపోయింది. అయితే ప్రత్యేక హోదాకు అడ్డు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులేనంటూ నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని మరుగున ఉంచి ఇపుడు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పిన మాటలను తాము ముందే చెప్పామన్నట్లుగా టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.
ప్రతిపక్ష నేత జగన్, సీఎం చంద్రబాబుకూ మధ్య పలు మార్లు ప్రత్యేక హోదా విషయంలో వాదోపవాదాలు జరిగినా 2017, మార్చి 17వ తేదీన ఇద్దరికీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అప్పుడు ఎవరేమన్నారో ఈ క్లిప్పింగ్‌లో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment