Shyam Babu Subudhi
-
ఈ సుబుద్ధి.. ఒక్కసారీ గెలవలేదు
గజనీ మహ్మద్ భారతదేశంపై 17 సార్లు దండెత్తి విఫలుడయ్యాడని చారిత్రక కథనం. ఒడిశాకు చెందిన ఈ ఎన్నికల గజనీ ఏకంగా 32 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ముప్పయి మూడోసారి మళ్లీ బరిలో దిగారు. అదీ రెండుచోట్ల. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన హోమియోపతి వైద్యుడు శ్యామ్‌బాబు సుబుద్ధి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అస్కా, బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారు.1962 నుంచి ఇంత వరకు ఆయన లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 సార్లు పోటీచేసి ‘విజయవంతంగా పరాజయం’ పాలయ్యారు. అయినా వెరవకుండా ఇప్పుడు మరోసారి పోటీకి సై అంటున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా జూన్ 11న రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని 84 ఏళ్ల సుబుద్ధి చెప్పారు. గతంలో సుబుద్ధి పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్ వంటి ఉద్దండులతో పోటీ పడ్డారు. ఈసారి తనకు ఎన్నో పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని ఆయన అంటున్నారు. ఎన్నికల ఖర్చంతా ఆయనే సొంతంగా పెట్టుకుంటారట. రైళ్లు, బస్సుల్లో, మార్కెట్లలో ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘గెలుపోటములను నేను పట్టించుకోను. అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటాను. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు శ్యామ్. -
ఏకంగా 34సార్లు ఓడిపోయాడు.. ఐనా!
భువనేశ్వర్: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఎన్నికలు ఏదైనా ఆయన పోటీ చేయాల్సిందే. 1962 నుంచి ఒడిశా బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. ఓటమి ఆయనను ఏనాడూ ఆపలేదు. నిరుత్సాహ పరచలేదు. నిజానికి ఎన్నికల్లో ఇప్పటికీ 32సార్లు ఆయన ఓడిపోయాడు. అయినా, ఈసారి ఒకటి కాదు రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనే ఒడిశా ఎన్నికలకు బాగా సుపరిచితుడైన శ్యాంబాబు సుబుద్ధి. 84 ఏళ్ల వయస్సులో తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుబుద్ధి.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో ముచ్చటించారు. ‘నేను మొదటిసారి 1962లో ఎన్నికల్లో పోటీ చేశాను. అప్పటినుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఇలా భిన్నమైన ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేస్తూ వస్తున్నాను. తమ పార్టీలో చేర్సాలిందిగా పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. కానీ, నేను ఎప్పుడూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తూ వచ్చాను’ అని తెలిపారు. సర్టిఫైడ్ హోమియోపతి డాక్టర్ అయిన సుబుద్ధి ఈసారి ఆస్కా, బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతేకాదు, జూన్ 11న ఒడిశాలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం బీజు పట్నాయక్‌లపై కూడా ఆయన పోటీ చేశారు. ‘రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటాను. మార్కెట్లు, కూడళ్లలోనూ ప్రచారం చేస్తాను. గెలుపోటములు నాకు ముఖ్యం కాదు. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఈసారి ఎన్నికల గుర్తుగా నాకు క్రికెట్ బ్యాటును కేటాయించారు. అందుకే పీఎం అభ్యర్థి అని రాసి ఉన్న బ్యాటును ప్రచారంలో ఉపయోగిస్తున్నాను’ అని సుబుద్ధి వివరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, మద్యం పంపిణీ వంటి చర్యలు తనను తీవ్ర అసంతృప్తి గురి చేస్తున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని సుబుద్ధి చెప్పారు. చదవండి: ఎన్నికల్లో పోటీ.... ఆయన హాబీ! -
ఎన్నికల్లో పోటీ.... ఆయన హాబీ!
బరంపురం : ఎవరి సరదా వారికానందం-అనే నానుడిని నిజం చేస్తున్నాడు ఒడిశాకు చెందిన 78ఏళ్ల కె.శ్యాంబాబు సుబుధి. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమంటే భలే సరదా. అవి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా సరే! గెలుపు ఓటములతో ఆయనకస్సలు సంబంధమే లేదు. నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి... నామినేషన్ పత్రంతో సిద్ధమైపోతాడు. ఇలా ...1957 నుంచి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీకి మొత్తం 27 సార్లు ఎన్నికల బరిలో దిగాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ రాజకీయాల్లో తలపండిన వారిపైనే పోటీకి దిగటం శ్యాంబాబు మరో ప్రత్యేకత. అయితే, ఏ ఒక్కసారీ గెలిచింది లేదు. ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపించకపోతారా అంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల క్షేత్రంలో రణానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో శ్యాంబాఉ తనదైన పద్దతిలో పోటీకి సిద్ధమైపోయారు. ఈసారి ఆయన బరంపురం, ఆస్కా స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని, ఇప్పటికే సైకిల్‌పై ప్రచారం మొదలెట్టారు.