బూడిద మిగిలింది
కొత్తచెరువు, న్యూస్‌లైన్ : ‘అయ్యో.. ఓరి దేవుడా.. బియ్యం గింజలతో సహా అన్నీ కాలిపోయాయి.. ఇప్పుడెలా బతకాలయ్యా..’ అంటూ వారు ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నట్లుండి మంటలు వ్యాపించి కొత్తచెరువు మండలం బండమీదపల్లిలో 34 గుడిసెలు, కొట్టాలు బుగ్గిపాలయ్యాయి. తొలుత ఓ గుడిసెకునిప్పంటుకున్న విషయం ఓ బాలుడు గుర్తించి కేకలు వేశాడు.
సమీపంలోని ఇళ్లలో ఉన్న గ్రామస్తులు బయటికొచ్చే లోగానే మంటలు పక్కనే ఉన్న గుడిసెలు, కొట్టాలకు వ్యాపించాయి. మంటలు అదుపు చేయలేని స్థాయికి చేరుకోవడంతో గ్రామస్తులు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖరరెడ్డి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పుట్టపర్తి నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలు అదుపు చేయలేక పోవడంతో, పెనుకొండ నుంచి మరో ఫైరింజన్‌ను రప్పించి మంటలార్పారు. ఈ సంఘటనలో 34 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. కట్టుబట్టలు తప్ప మరే మీ మిగలకపోవడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి, సీఐ శ్రీధర్ గ్రామానికి చేరుకుని సంఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. పుట్టపర్తి నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సతీమణి ఉమ బాధితులను పరామర్శించారు.