పెన్నా నదిలో ఈతకెళ్లి ముగ్గురు బాలురు దుర్మరణం
సిద్దవటం :
వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మాచుపల్లె సమీపంలోని పెన్నా నదిలో ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కడప నగరం బెల్లంమండి వీధికి చెందిన షేక్ సోహేల్ (11), రామాంజనేయపురం గ్రామంలోని దండోరా కాలనీకి చెందిన రాయపాటి లక్ష్మికాశీ(9), రాయపాటి కిరణ్(10)తో పాటు మరో ముగ్గురు బాలురు వారి పెద్దలతో కలిసి ఆదివారం మాచుపల్లె దర్గా వద్దకు చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా గతంలో ఇసుక కోసం తీసిన గోతులు ఉన్న విషయం తెలియక ఆ ప్రాంతానికి వెళ్లిన ఆరుగురు బాలురు మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే నీళ్లలోకి దిగి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురు బాలురను కూడా ఒడ్డుకు తీసుకురాగా వారు అప్పటికే మృతి చెంది ఉన్నారు. వెంటనే మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులను రిమ్స్‌కు పంపి సమాచారం తెలుసుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ శ్రీరాములు, సిద్దవటం ఎస్ఐ లింగప్ప తెలిపారు. కళ్లముందు ఆనందంగా కనిపించిన కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.