sidha raghava rao
-
'కొట్టుకు పోయిన రోడ్లకు రూ.800కోట్లు'
భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో కోతకు గురైన రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ 800 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. ఈ మూడు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి తర్వరలో కేంద్ర బృందం రానున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి .. అనంతరం దేవస్థానం అతిధిగృహంలో మీడియాతో మాట్లాడారు. నాబార్డు, ఆర్డీఎఫ్, ఆర్ఏడీఎఫ్, సీఆర్ఎఫ్ల ద్వారా రూ.1500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, ప్రయాణీకుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ నష్టం వచ్చినా శ్రీశైలం నుంచి బ్రహ్మగిరికి బస్సులు నడపాలని మంత్రి సిద్ధా.. ఆర్ఎం వెంకటేశ్వరరావును ఆదేశించారు. -
'ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం'
గోదావరి పుష్కరాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు 13 జిల్లా నుంచి పుష్కరాలకు 1600 బస్సులు రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా రవాణా సౌకర్యాలను కల్పిస్తామని రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గోదావరి పుష్కరాలకు రవాణా ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఎండీ సాంబశివరావు, రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జూలై 14 నుంచి 26 వరకూ నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.785 కోట్లను మంజూరు చేశామని చెప్పారు. ఆ పనుల్లో 95 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనులను నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు 1600 బస్సులను ప్రత్యేకంగా కేటాయించామని చెప్పారు. రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు నుంచి పుష్కర ఘాట్ల వరకూ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు 300 బస్సులను ఆర్టీసీ సమకూర్చుతుందన్నారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా పుష్కర ఘాట్లకు తీసుకెళ్లి.. మళ్లీ బస్టాండు, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల వద్దకు చేర్చుతామని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 160 కిమీల మేర బారీ కేడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు వేయాలని రైల్వే శాఖను కోరుతామని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రత్యేక విమానాలు, హెలీ కాఫ్టర్లను నడపాలని కేంద్ర విమానయాన శాఖను కోరుతామన్నారు. -
ఓర్పునకు మారుపేరు మహిళ
ఒంగోలు టౌన్ : ఓర్పు, నేర్పు, క్రమశిక్షణకు మహిళ మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల ముగింపు సభ ఆదివారం రాత్రి ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్నమంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ముఖ్యమంత్రి ప్రకటించారని ఉద్యోగులంతా అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ మహిళల విషయంలో ప్రజల ఆలోచనా విధానం మారాలన్నారు. ఇప్పటికే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి ఆలోచనా విధానం మానుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పాటు చైల్డ్‌కేర్ లీవ్ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్ఎస్ఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అందుకు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లే నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులు కావాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబంతో పాటు సమాజంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ రత్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతి, ఎమ్మెల్యే భార్యతో పాటు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సచివాలయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, డీఎంహెచ్‌వో యాస్మిన్, సాంఘిక సంక్షేమ శాఖ జీడీ సరస్వతి, ఎన్ఎస్పీ ఎస్ఈ శారద తదితరులు పాల్గొన్నారు.