sidheswara swamy
-
ముగిసిన సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
అమరాపురం : మండలంలోని హేమావతిలో సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 24న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజు శయనోత్సంలో భాగంగా స్వామివారికి అర్చకులు, సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పరస్పరం రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ కృతజ్ఞతలు తెలిపారు. -
పోటెత్తిన జనం
- కనుల పండువగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం - స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన పెద్ద రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మడకశిర, హిందూపురం, కర్ణాటక ప్రాంతాలు చెళ్లికెర, హరియూర్, శిర, తుమకూరు, మైసూర్, బెంగళూరు, మండ్య తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా వివిధ రకాల పూలమాలలతో అలంకరించి బ్రహ్మరథోత్సవం వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి వేదమంత్రోచ్చారణల మధ్య రథోత్సవంలో కూర్చోబెట్టారు. అశేష భక్త జన సమూహం మధ్య ఓం నమఃశివాయా.. సిద్ధేశ్వరస్వామి మహరాజ్‌కీ జై.. శివ.. శివహర శంభో అంటూ శివనామస్మరణలతో భక్తులు రథోత్సవాన్ని ముందుకు లాగారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో హేమావతి గ్రామం జనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు బిజీబిజీగా మారాయి. -
వైభవంగా హెంజేరు సిద్ధేశ్వర చిన్నరథోత్సవం
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చిన్న రథోత్సవంలో కూర్చోబెట్టి హంపణ్ణస్వామి గుడి వరకు స్వామివారి నామస్మరణలతో భక్తులు ముందుకు లాగారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాలపల్లకీలో స్వామివారిని గ్రామంలోని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. సర్పంచ్ సదాశివ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంటకస్వామి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు బ్రహ్మరథోత్సవం సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.