sidimanu festival
-
కనులపండువగా సిడిమాను ఉత్సవం
అమరాపురం (మడకశిర): అమరాపురం మండలం హేమావతి హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సిడిమాను ఉత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వెండితో చూడముచ్చటగా అలంకరించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని కుడివైపున ఉన్న సిడిమాను వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. పెద్ద సిడిమానుకు ఒకవైపు భక్తులు వేలాడుతుండగా... మరొకవైపు తిప్పుతుంటారు. మొక్కులు తీర్చుకునేవారు, కోరికలు కోరుకునేవారు పురాతనమైన మానును గాలిలో తిప్పుతూ దానికున్న తాడును పట్టుకుని పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల రోగాలు నయమవుతాయని, సంతానం కలుగుతుందని, పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు సర్పంచి సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమార్‌స్వామి అన్నదానం నిర్వహించారు. రాత్రి ముత్యాలపల్లకీలో స్వామివారిని ఊరేగించారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటస్వామి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
వైభవంగా సిడిమాను ఉత్సవం
రాయదుర్గం లోని ఫైర్‌స్టేషన్ వద్ద గల మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద బుధవారం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మారెమ్మ ఆలయం వద్ద సిడి మాను ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిడికి బాలున్ని కట్టి మూడుసార్లు తిప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ మహానంది ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవానికి వైఎస్సార్ సీపీ నేత గౌని ఉపేంద్రరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎన్టీ సిద్దప్ప, వసంతరాజులు, సీతారాం, మునిసిపల్ చైర్మన్ వీఎం రాజశేఖర్, కౌన్సిలర్ వై.వెంకటేశులు, టీడీపీ నాయకులు లోకేష్ పాల్గొన్నారు.