ఇంకెన్నాళ్లు ఆగాలి?
♦ మూడేళ్లుగా ఎదురు చూసినా స్పందించరా..
♦ నెలాఖరులోగా రైతులకు బీమా సొమ్ము ఇవ్వాలి
♦ లేదంటే బీమా కంపెనీ కార్యాలయాన్ని ముట్టడిద్దాం
♦ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ధ్వజం
♦ అఖిలపక్షం నేతల రోడ్డు దిగ్బంధనానికి భారీగా రైతులు
వీరపునాయునిపల్లె : నెలాఖరులోగా పంటల బీమా మంజూరు చేయకపోతే రైతులు, అఖిల పక్షం నాయకులతో కలసి బీమా కంపెనీ కార్యాలయాన్ని ముట్టడిద్దామని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. 2012 రబీ సీజన్‌కు సంబంధించి పంటల మీమా ప్రీమియం చెల్లించిన రైతులందరికి బీమా మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం మండల పరిధిలోని తంగేడుపల్లె క్రాస్ వద్ద అఖిలపక్ష కమిటి నాయకులు రైతులతో కలసి రోడ్డు దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజ రై సంఘీభావం తెలుపుతూ వారు మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎప్పటికీ రైతుల పక్షమేనన్నారు. జగన్మోహనరెడ్డి
పలు మార్లు రైతుల కోసం దీక్ష చేపట్టాడని గుర్తు చేశారు. చిన్న చిన్న కారణాలతో రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. లోపాలుంటే మూడు నెలల్లో సరి చేయాల్సిన అధికారులు మూడేళ్లు గడిచినా పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. విషయాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జిల్లాపై వివక్ష చూపుతున్నారనేందుకు ఇదే నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా బీమా మంజూరు చేయకపోతే రైతులు, అఖిలపక్షం నేతలతో కలిసి హైదరాబాద్‌లోని బీమా కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ బీమా కంపెనీ నిర్వాకం వల్ల కేవలం 20 వేల మంది రైతులకు మాత్రమే బీమా అందిందని తెలిపారు. మిగిలిన 40 వేల మంది రైతులు రోడ్డుపైకి రావడం విచారకరమన్నారు. రైతులంతా ఐకమత్యంతో పోరాడితేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుందన్నారు.
దొంగ పాసుపుస్తకాల వల్లే బీమా రాలేదు: వరద
వీరపునాయునిపల్లె : పులివెందుల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చాలా మంది రైతులు నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి వాడుకుంటున్నారని, ఈ కారణంతోనే పంటల బీమా అందడం లేదని ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఎన్. వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తంగేడుపల్లె క్రాస్ మీదుగా వెళ్తున్న అయన్ను బీమా ప్రీమియం కోసం రోడ్డు దిగ్భందించిన రైతులు తమకు మద్దతు తెలపాలని కోరగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరద మాటలు విన్న రైతులు.. దొంగల్లా కనపడుతున్నామా..అంటూ అయన్ను ప్రశ్నించారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకొని వరదను అక్కడి నుంచి పంపించేశారు.
ఇది దుర్మార్గ ప్రభుత్వం
నేను మారిన మనిషినని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెబుతున్నాడే కాని నిధులు మాత్రం మంజూరు చేయలేదు.
- చంద్రశేఖర్, సీపీఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి
రైతుది బానిస బతుకు
నేడు స్వదేశీ పాలనలో రైతులు బానిస బతుకు బతుకుతున్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. 2012 రబీ బీమా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రైతుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. -చంద్రశేఖరరెడ్డి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రైతులంటే ఇంత నిర్లక్షమా?
చిన్న కారణంతో రైతులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు నెలాఖరులోగా బీమా ఇవ్వాలి. లేకపోతే రైతులతో కలసి ఆందోళన చేపడతాం. - రామసుబ్బారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
బీమా కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం
ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు బీమా అందజేయాలి. జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతులకు అన్యాయం జరిగింది. బీమా కంపెనీ జనరల్ మేనేజర్ రైతులపై కక్ష పూరిత ధోరణిలో వ్యవహ రిస్తున్నారు. రైతుల తరఫున బీమా కంపెనీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం.
-సోమశేఖరరెడ్డి,కాంగ్రెస్‌కిసాన్ విభాగం రాష్ట్ర నాయకుడు