నిస్సహాయ మగాళ్లకో యాప్..
కోల్‌కతా: ఇంటా బయట సమస్యలతో సతమతమయ్యే మగవారిని ఊరడించేందుకు ఓ మొబైల్ యాప్ సిద్ధమైంది. దేశంలో మగవారి హక్కుల కోసం పోరాడుతున్న సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్(ఎస్ఐఎఫ్ఎఫ్) దీన్ని రూపొందించింది. ‘ఎస్ఐఎఫ్ వన్’ అని వ్యవహరించే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘గృహ హింస బాధితులు, నిరాశలో కూరుకుపోయిన వారు, కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పురుషులు ఈ యాప్‌తో తక్షణం సాయం పొందవచ్చు. 50 నగరాల్లో 50 స్వచ్ఛంద సంస్థల వివరాలు ఇందులో ఉంటాయి.
బాధితులు న్యాయ సాయం పొందవచ్చు. కీలక కేసులకు సంబంధించిన తీర్పు వివరాలు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి’ అని సేవ్ ఇండియా ఫౌండేషన్ కన్వీనర్ అమిత్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రభుత్వ పరంగా వివక్షకు గురవుతున్న మగవారికి మద్దతుగా నిలవటమే తమ లక్ష్యమన్నారు. గత వారమే ప్రారంభమైన ఈ యాప్‌ను 12,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 8 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు చేరువ కావాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు.
జాతీయ నేర రికార్డుల గణాంకాల ప్రకారం ఏటా 64,000 మందికి పైగా పెళ్లయిన మగవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాదాపు 8.3 నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాలు తీసుకుంటున్నారు.పురుషుల సంక్షేమం కోసం ఓ మంత్రిత్వ శాఖను, కమిషన్‌ను నెలకొల్పాలని సేవ్ ఇండియా ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది.