సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)