జగదాంబలో క్రేన్ బీభత్సం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జగదాంబ జంక్షన్లో సోమవారం ఉదయం క్రేన్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో పలు వాహనాలను ఢీకొంది. ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఐఎన్ఎస్ డేగా ఉద్యోగి ఈ సంఘటనలో దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. స్థానిక 21వ వార్డు తాడివీధికి చెందిన గరుగుమిల్లి జీవన్‌కుమార్(40) ఐఎన్ఎస్ డేగాలో స్ప్రే పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య మంగవేణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డిగ్రీ చదువుతున్న కుమార్తె హరిప్రియను కళాశాల వద్ద దించేసి డ్యూటీకి వెళ్లేందుకు జగదాంబ జంక్షన్ వైపు వచ్చాడు.
రెడ్ సిగ్నల్ పడడంతో సిగ్నల్ పాయింట్ వద్ద బైక్ నిలిపాడు. జగదాంబ జంక్షన్ వైపు వచ్చిన క్రేన్ బ్రేకులు ఫెయిలై బైక్‌ను ఢీకొంది. అతడు పక్కన పడిపోగా తలపై నుంచి క్రేన్ వె ళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కారును కూడా కొంత దూరం తోసుకుపోగా పలువురు రాళ్లు వేసి క్రేన్‌ను ఆపగలిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. క్రేన్ డ్రైవర్ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నయ్యని తెలియలేదు
ప్రమాదం జరిగిన సమయంలో ఆ పక్కనే ఆటో నిలిపి ఉన్నానని, అన్నయ హెల్మెట్ ధరించి ఉండడంతో ఎవరో అనుకుని వెళ్లిపోయూనని మృతుడి సోదరుడు లబోదిబోమన్నాడు. సంఘటన ఉదయం 9.15 గ ంటల ప్రాంతంలో జరిగితే 10.30 గంటలకు తనకు సమాచారం వచ్చిందని వాపోయూడు.
పోలీసుల నిర్లక్ష్యమే?
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల సమయంలో నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు. సామాన్యుడిపై ప్రతాపం చూపించే పోలీసులు భారీ వాహనాలపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ మినీ వ్యాన్ చాకలిపేట వద్ద బీభత్సం సృష్టించింది. తర్వాత మరో వ్యాన్ అదే ప్రాంతంలో బ్రేకులు ఫెరుులై గోడను ఢీకొంది. నగర నడిబొడ్డున ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.