ఉయ్యాలవాడకు ‘అనంత’ నీరాజనాలు
ఉయ్యాలవాడకు ‘అనంత’ నీరాజనాలు
– జాతీయ యోధుడిగా గుర్తించాలని సంతకాల సేకరణ ఉద్యమం
అనంతపురం కల్చరల్ : తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనంత వాసులు నీరాజనాలర్పించారు. నరసింహారెడ్డిని జాతీయ యోధుడిగా గుర్తించాలని శనివారం సంతకాల సేకరణ జరిగింది. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టవర్‌క్లాక్ వద్ద జరిగిన సంతకాల సేకరణకు రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. కమ్యూనిస్టు నాయకులు రామకృష్ణ, జగదీష్, రమణ తదితరులు మాట్లాడుతూ ఉత్తరాదికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులకు ఇచ్చిన గౌరవంలో దక్షిణాది ప్రాంత యోధులకు ఇవ్వకపోవడం విచారకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఉయ్యాలవాడ జన్మించిన కర్నూలుకు కూడా తగిన ప్రాధాన్యత లేకపోవడం సిగ్గు చేటన్నారు.
ఆయన జీవితంపై సినిమా వస్తోందని తెలిసిన తర్వాతే ఆయన గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నారు. నిర్వాహకులు జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఆంగ్లేయులను ఎదిరించిన విప్లవమూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలన్నదే తమ ధ్యేయమన్నారు. గత మే నెలలో తమిళనాడు నుంచి ఉద్యమం ప్రారంభించామన్నారు. ‘వాడవాడలా ఉయ్యాల వాడ మాట..యువతకు నూతన బాట’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉయ్యాలవాడ చరిత్రకు గుర్తింపు తెస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయామన్నారు.
ఆమోదించిన తీర్మానాలు :
అనంతరం ప్రజా సంఘాల సమక్షంలో పలు తీర్మానాలు ఆమోదించారు. తొలి స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను భావితరం వారికి స్పూర్తినందించడానికి పాఠ్యాంశాలుగా పెట్టాలని, ఉయ్యాల వాడ వర్ధంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, ఆయనను ఉరి తీసిన జుర్రేటి వాగు ప్రాంతంలో మెమోరియల్‌హాలు నిర్మించి స్మృతివనంగా మార్చాలని, పార్లమెంటులో ఆయన విగ్రహం ప్రతిష్టించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో ఆయన విగ్రహాలుండాలని, కర్నూలుకు ఉయ్యాల వాడ పేరు పెట్టాలని, ప్రత్యేక స్టాంపు విడుదల చేయాలని తీర్మానించారు. అంతకు ముందు రెడ్డి పరివార్ సంఘం నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు.