మంత్రికి చెంపదెబ్బ : సింగ్‌కి ఘన సత్కారం
అమృతసర్ : పంజాబ్ పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్‌ని చెంపదెబ్బ కొట్టి సంచలనం సృష్టించిన జర్నైల్ సింగ్ (55)ని రాడికల్ సిక్కు గ్రూప్ శిరోమణి అకాలీ దళ్ (అమృతసర్) ఘనంగా సన్మానించింది. శుక్రవారం అమృతసర్‌లో జర్నైల్ సింగ్ నివాసానికి ఆ సంస్థ ప్రతినిధులు చేరుకున్నారు. అనంతరం జర్నైల్ సింగ్‌కు రూ. 2.20 లక్షల నగదు చెక్కును అందజేశారు.
ఆ తర్వాత ఆ సంస్థ అధ్యక్షుడు సిమ్రజిత్ సింగ్ మాన్ మాట్లాడుతూ... మంత్రి సికిందర్‌ను ప్రశ్నించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టిన జర్నైల్ సింగ్ నిజమైన సిక్కు అని అభివర్ణించారు. జర్నైల్ సింగ్ ధైర్యవంతుడు అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం అధికారంలోని అకాలీ దళ్ (బాదల్) పార్టీ మతాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. అమాయక ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆ పార్టీని సిమ్రజిత్ సింగ్ విమర్శించారు.
నవంబర్ 20వ తేదీన బటిండాలోని హమిగఢ్ గ్రామంలో అకాలీ దళ్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పంజాబ్ పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్ ముల్కా పాల్గొన్నారు. అయితే ఆయన్ని జర్నైల్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడు. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జర్నైల్ సింగ్‌పై చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు ఫరీద్ కోట్ ఆసుపత్రికి తరలించారు. కాగా జర్నైల్ సింగ్‌పై ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకు అప్పగించింది. జర్నైల్ సింగ్ మాత్రం ఈ కేసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.