Sikh woman
-
NRI Killings: మొన్న మెహక్.. నిన్న కౌర్
టొరంటో: విదేశాల్లో భారతీయులపై, భారత సంతతికి చెందిన వాళ్లపై దాడుల పర్వం కొనసాగుతోంది. నవంబర్ 22వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో మెహక్‌ప్రీత్ సేథి(18) అనే భారతీయ విద్యార్థిని దుండుగులు పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఆ టీనేజర్ కుటంబానికి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీ సైతం నిర్వహించారు అక్కడి ఎన్నారైలు. తాజాగా.. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక సిక్కు యువతి(21) ప్రాణాలు కోల్పోయింది. మిస్సిసౌగా నగరంలోని బ్రంప్టన్కు చెందిన కెనడా పౌరురాలు పవన్‌ప్రీత్ కౌర్ రాత్రి 10.40 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్ సమీపంలో ఉండగా దుండగుడొకడు దగ్గర్నుంచి కాల్పులు జరిపి, పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కౌర్ అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఎవరో కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నామన్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన కౌర్ మరణంతో ఆమె తల్లి గుండెలు పగిగేలా రోదిస్తోంది. -
ప్రేమ వ్యవహారం.. యువతికి వినూత్న శిక్ష
లండన్ : ప్రేమించినవాడు దక్కలేదన్న అక్కసుతో ఓ బ్రిటిష్ సిక్కు యువతి మూర్ఖంగా ప్రవర్తించి జైలు పాలయింది. దాదాపు అయిదేళ్లుగా మాజీ ప్రియుడినీ, అతని కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్న అమన్‌దీప్ ముధార్ (26).. ఆమె ఫ్రెండ్ సందీప్ డోగ్రా (30)కు ఇంగ్లండ్‌లోని సీన్డన్ క్రౌన్ కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. జాతివివక్ష, మత విశ్వాసాలు, సామాజిక సంబంధాల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు వారిద్దరికీ రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష అమలు చేయాలని స్వీన్డన్ క్రౌన్ కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. కోర్టు తెలిపిన వివరాలు.. ముధార్, కృపాకర్ (పేరుమార్చాం) అనే హిందూ యువకుడు 2012లో ప్రేమలోపడ్డారు. అయితే, కొన్నాళ్లపాటు కలిసున్న అనంతరం మతాలు, సంప్రదాయాల విషయంలో మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి యువకుడిపై పగ పెంచుకున్న ముధార్ తన మిత్రుడు సందీప్‌తో కలిసి కృపాకర్‌పై కక్ష సాధింపు మొదలు పెట్టింది. అతని కుటుంబ సభ్యులను మతం, జాతి పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టింది. కృపాకర్ చెల్లెల్లను రేప్ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసింది. వారి మత విశ్వాశాలు దెబ్బతినేలా ప్రవర్తించింది. కృపాకర్ కుటుంబం వెళ్లే దేవుడి సన్నిధిలో సైతం దుర్భాషలాడింది. అంతటితో ఆగక వాళ్లింట్లో పశు మాంసం పారవేసింది. ఇంకా... కృపాకర్ చెల్లెలి కొడుకుని స్కూల్లో మరో పిల్లాడితో కలిసి వేధింపులకు గురిచేసింది. రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష మాత్రమే కాకుండా.. మత విశ్వాశాలపై దాడి చేసినందుకు 100 గంటల ధార్మిక సేవ, కోర్టు ఫీజుల కింద 750 పౌండ్ల జరిమానా విధించింది. కాగా, ముధార్ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగానే మొండితనం, పెంకితనం వచ్చాయనీ ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లి సంరక్షణలో వేధింపులకు గురికావడంతోనే అలా తయారైందని విన్నవించారు. అతని వాదనలతో ఏకీభవించని కోర్టు ఈ వినూత్న శిక్షతో ముధార్ ప్రవర్తనలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు.. లండన్‌లోని సిక్కు కమ్యునిటీ కూడా ముధార్, సందీప్ చర్యలపై మండిపడింది. వారికి ఎటువంటి సాయం చేయబోమని ప్రకటించింది. సస్పెండెడ్ జైలు శిక్ష అనగా.. సాధారణ జైలు శిక్ష విధించే క్రమంలో ముద్దాయిలకు ఒక అవకాశంగా సస్పెండెడ్ జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షా కాలంలో ముద్దాయి ప్రవర్తనపై నిఘా ఉంచుతారు. విపరీత మనస్తత్వం కలిగిన సమూహంలో వారిని విడిచిపెడతారు. అక్కడ వారు మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో శిక్షా కాలం పూర్తి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా సస్పెండెడ్ జైలు శిక్ష కాలంలో కూడా నేరాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై విచారణ చేసి మునుపటి జైలు శిక్ష.. తాజా శిక్షను విధించి కటకటాల వెనక్కి పంపుతారు. -
తలపాగా చుట్టిన మొదటి మహిళా పోలీసుగా..
న్యూయార్క్ : తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్ పోలీస్ విభాగంలో చేరనున్నారు. గురుశోచ్ కౌర్ అనే సిక్కు మహిళ తొలిసారిగా ఈ ఘనత సాధించారు. న్యూయార్క్ సిటీ పోలీస్ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరనున్నారు. ‘‘గురుశోచ్ కౌర్‌ను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆహ్వానించటం చాలా గర్వంగా ఉంది. మిగిలిన వారికి కూడా అభినందనలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. క్షేమంగా ఉండాల’’ని సిక్క్ ఆఫీసర్స్ అసోషియేషన్ ట్విటర్ లో పేర్కొంది. యూఎస్ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్ కౌర్ మార్పుతేవాలని ‘మినిష్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్’ హరదీప్ సింగ్ పూరి కోరారు. ఆయన 2010లో తనకు జరిగిన అవమానాన్ని, ఈ మధ్యనే కెనాడా మంత్రి నవదీప్ బేన్స్కు జరిగిన అవమానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిక్కులు సామరస్యానికి రాయబారులని అన్నారాయన. -
అమెరికాలో మరో విద్వేషం
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సబ్వే రైలులో ప్రయాణిస్తున్న ఓ సిక్కు మహిళను శ్వేతజాతీయుడు దూషించిన ఘటన వెలుగుచూసింది. ఆమెను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళగా భావించి ‘ఈ దేశానికి చెందిన వ్యక్తివి కావు. లెబనాన్‌కి తిరిగి వెళ్లిపో..’ అంటూ ఆ దుండగుడు తీవ్రంగా దూషించాడు. ఈ ఘటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే ‘దిస్ వీక్ ఇన్ హేట్’లో ఆమె వివరించింది. స్నేహితురాలి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు రాజ్‌ప్రీత్ హైర్ అనే మహిళ మన్‌హట్టన్ వైపు వెళ్లే సబ్వే రైలు ఎక్కింది. ఆ సమయంలో రైలులోని ఓ శ్వేతజాతీయుడు ఆమెను దేశం విడిచి వెళ్లాలంటూ పెద్దగా కేకలు వేశాడు. పరుష పదజాలంతో తీవ్రంగా దూషించాడు. కాగా, తాను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళను కాదని, ఇండియానాలోని ఓ నగరంలో జన్మించినట్లు పేర్కొంది. అయితే ఆ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఆ దుండగుడు తనను దూషించి ఉండవచ్చని ఆమె పేర్కొంది. అనంతరం ఇద్దరు మహిళలు తనకు ధైర్యం చెప్పారని, మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఇది మా దేశం... ఇక్కడే ఉంటాం వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా ఇండో–అమెరికన్లు గళమెత్తారు. ‘ఇది మా దేశం. ఇక్కడ నివసించడానికే వచ్చాం. ఈ దేశంలో మా న్యాయ, సమాన హక్కులను డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ టౌన్‌హాల్ సమావేశంలో దక్షిణాసియా అమెరికన్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) ప్రతినిధి సుమన్ రఘునాథన్ అన్నారు. ఇటీవల పెరిగిన విద్వేష దాడులకు వ్యతిరేకంగా యూదులు, ముస్లింలు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల్లో శాంతి నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు. -
సిక్కు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సిక్కు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. చంఢీగఢ్ కు చెందిన హర్మీత్ కౌర్ ధిల్లాన్ రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఎన్నికైంది. లాయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ధిల్లాన్.. గతంలో కాలిఫోర్నియా రిపబ్లికన్ పార్టీకి వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవిలో కొనసాగిన తొలి మహిళగానూ ఆమె అందరికీ సుపరిచితురాలు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు అమెరికాకు వలసవచ్చారు. నార్త్ కరోలినాలో ఆమె కుటుంబుం నివాసం ఉంటోంది. కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఈ కమిటీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. జూలై చివర్లో ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ విధానాలకు మరింత ముందుకు తీసుకెళ్తానని, మరో నాలుగేళ్లు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు హర్మీత్ కౌర్ ధిల్లాన్ తెలిపారు. -
ప్రపంచానికి సవాల్ విసిరింది..!
మెల్ బోర్న్: ఇండో-అమెరికన్ సిక్కు నడుటు వారిస్ అహ్లువాలియా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా అదే సమయంలో ఓ సిక్కు యువతి ప్రపంచాన్ని షేక్ చేసేసింది. తన పాటతో ప్రపంచానికి సవాల్ విసిరిందని చెప్పవచ్చు. జాతి వివక్ష అంశంపై తాను రూపొందించిన పాటతో 21 ఏళ్ల సుఖ్ జిత్ కౌర్ ఖల్సా పెద్ద ప్రయోగమే చేసిందని చెప్పవచ్చు. ఈ నెల 8న ఆస్ట్రేలియా టాలెంట్ షోలో పాల్గొన్న ఆమె పాడిన పాటకు మంత్ర ముగ్దులైన అక్కడున్న ఆస్ట్రేలియా వాసులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఆ యువతి పాట పాడిన ఈ వీడియోను షేర్ చేస్తుండటంతో తక్కువ సమయంలో ప్రపంచమంతటా వ్యాపించింది. 'ఇది నిజంగా చాలా సిగ్గుచేటు.. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.. నేను అలాంటి ఇలాంటి వ్యక్తిని కాదు.. అసలుసిసలైన సిక్కును' అని తన పాటతో చెప్పింది. తొలుత ఆమె స్టేజీ మీదకు వెళ్లేటప్పుడు అక్కడున్న వారి నుంచి కాస్త నిరసన వ్యక్తం అయింది. పాట లాంటి పద్యం అందుకున్న తర్వాత సుఖ్ జిత్ తనదైన శైలిలో సిక్కు జాతి గురించి తన మాటల్లో తెలిపింది. తన అంకుల్ తలపాగాను ఒకరు తొలగించాలని యత్నించారని, అలా చేస్తే తాము ఎంత బాధకు గురవుతామన్న విషయాన్ని పద్యం రూపంలో పాడింది. ఆమెలో చాలా కోపంతో కూడిన అసహనం ఉంది. ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలని ఈ కార్యక్రమం న్యాయనిర్ణేతల్లో ఒకరైన ఇయాన్ డిక్సన్ వ్యాఖ్యానించారు. ఫ్యాషన్ డిజైనర్, నటుడు వారిస్ అహ్లువాలియాను విమానం ఎక్కకుండా ఎయిర్ పోర్టు అధికారులు ఈ నెల 8న అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే రోజున ఓ షో లో పాల్గొన్న సుఖ్ జిత్ కౌర్ తన బాధను ప్రపంచానికి తెలిసింది.