సిక్కు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సిక్కు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. చంఢీగఢ్ కు చెందిన హర్మీత్ కౌర్ ధిల్లాన్ రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఎన్నికైంది. లాయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ధిల్లాన్.. గతంలో కాలిఫోర్నియా రిపబ్లికన్ పార్టీకి వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవిలో కొనసాగిన తొలి మహిళగానూ ఆమె అందరికీ సుపరిచితురాలు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు అమెరికాకు వలసవచ్చారు.
నార్త్ కరోలినాలో ఆమె కుటుంబుం నివాసం ఉంటోంది. కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఈ కమిటీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. జూలై చివర్లో ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ విధానాలకు మరింత ముందుకు తీసుకెళ్తానని, మరో నాలుగేళ్లు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు హర్మీత్ కౌర్ ధిల్లాన్ తెలిపారు.