‘పట్టు’ పెంపకంతోనే ఆర్థికాభివృధ్ధి
కదిరి టౌన్ : పట్టు పురుగుల పెంపకంతో పట్టు రైతులు ఆర్థికంగా ఎదగవచ్చని కేంద్ర సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప తెలిపారు. గురువారం సాయంత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆయన విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పట్టు పరిశ్రమను ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహించేవారన్నారు. అయితే నేడు రోజురోజుకీ పెరుగుతున్న ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో పట్టుపురుగుల పెంపకం సులభతరం, లాభాదాయకంగా మారిందన్నారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పట్టుపురుగుల ఉత్పత్తిని తయారుచేస్తూ బీజేపీ ప్రభుత్వం పట్టు పరిశ్రమకు ఎన్నో రాయితీలను కల్పించి పట్టు సాగును ప్రోత్సహిస్తోందన్నారు. కర్నాటకలోని బెంగళూరులో పట్టు పరిశ్రమ పెంపకం శిక్షణా కేంద్రంలో పట్టు రైతులకు పట్టుపురుగుల పెంపకం, పట్టు సాగు తదితర మెలకువలపై ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు. పట్టు రైతులకు సిల్క్ రీలింగ్ యంత్రాలను 75 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పట్టుగూళ్ల పెంపకం, అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.