‘పట్టు’ సడలుతోంది!
– రోజురోజుకూ తగ్గుతున్న మల్బరీ సాగు
– ఆందోళనలో చేనేత వర్గం
ఒకప్పుడు ఎంతో కళకళలాడిన చేనేత నేడు చతికిల పడింది! పట్టు ధరలు నిలకడగాలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పట్టు సాగు గణనీయంగా తగ్గుతుండడంతో ఈభారం కాస్తా చేనేత కార్మికులపై పడుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో అపసోపాలు పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ప్రధానంగా పట్టు రైతులను ఆదుకుంటే దాదాపు పట్టు కార్మికులు కూడా సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.
- ధర్మవరం
ఒకప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. కనీసం వంద ఎకరాలకు తగ్గకుండా జిల్లా అంతటా మల్బరీ పంటను సాగు చేసేవారు. అయితే రానురాను మల్బరీ రైతులకు ప్రోత్సాహాకాలను అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో పాటు వర్షాభావ పరిస్థితులతో వరుస నష్టాలను ఎదుర్కొన్న అన్నదాతలు మల్బరీ సాగు నుంచి వైదొలుగుతూ వచ్చారు. దశాబ్దం క్రితం జిల్లాలో సాగు అయ్యే మల్బరీ నుంచి తీసిన పట్టుతో ఇక్కడి చేనేత కార్మికులకు చేతినిండా పని దొరికేది. ఫలితంగా ఇతర ప్రాంతాలనుంచి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రానురాను ప్రభుత్వం మల్బరీ రైతులను పట్టించుకోకపోవడంతో వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. ఫలితంగా నేడు పట్టు ఉత్పత్తి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం, దేశంలో కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చైనా పట్టుకు డిమాండ్ పెరిగింది.
20 వేల నుంచి 2 వేల ఎకరాలకు!
మల్బరీ పంట సాగు చేయడమంటే కత్తిమీద సాము చేయడమే. ఒక్కొక్కసారి పట్టు పురుగులు పెంచే సమయంలో సెకన్లలో పంట తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావారణ పరిస్థితులు అనుకూలించకుంటే రెండు నెలల పాటు కష్టపడి పెంచిన పంటంతా సెకన్లలో దిబ్బలోకి వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో ఇటు పెట్టుబడులతో పాటు అటు కష్టం అంతా వృధా అవుతోంది. దీంతో రైతులు చాలావరకు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు. ధర్మవరం డివిజన్ పరిధిలో నాలుగేళ్ల క్రితం వరకు 20 వేల ఎకరాల్లో సాగు అవుతున్న మల్బరీ పంట.. ప్రస్తుతం రెండు వేల ఎకరాలకు చేరుకుంది. మల్బరీ సాగుపై దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే ఈ దుస్థితి నెలకొంది.
రైతులకు అందని ప్రోత్సాహం
మల్బరీ పంట సాగు చేయాలనుకునే రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. మల్బరీ సాగుదారులకు తొలి విడతగా రేషం రూ.10వేలు విలువ చేసే పుల్లతో పాటు రేషం షెడ్డు, చంద్రికలు, శాఖీ పురుగులు తదితర వాటికి కలిపి సుమారు రూ.1.50 లక్షల మేర సబ్సిడీలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ మల్బరీ సాగు పంటపై ఆధారపడి జీవిస్తున్న వారిలో సగం మందికి కూడా ఈ సబ్సిడీలు అందడం లేదనేది నగ్న సత్యం. మల్బరీ సాగులో నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటే కొంత మేర ఊరటగా ఉంటుంది. ఫలితంగా మల్బరీ సాగు పెరిగే అవకాశమూ ఉంది.
దిగుమతి ఖర్చుకన్నా తక్కువే
ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రేషంకు కోట్లాది రూపాయలను సుంకం రూపంలో చెల్లించాల్సి వస్తోంది. చైనా పట్టుకు ఇంత భారీగా సుంకం చెల్లించి కొనేదానికన్నా.. మన రాష్ట్రంలోని రైతులకు మరిన్ని సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ఖర్చు తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మల్బరీ సాగు చేసే ప్రతి రైతు వద్దకెళ్లి సబ్సిడీలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటే ఇక్కడే పట్టు ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఫలితంగా నాణ్యమైన పట్టు ఉత్పత్తితో పాటు చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించినట్లవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడితే అన్నదాత ఇంట సిరులు కురిసినట్లే.