రూ.50 లక్షలతో బాహుదాలో పూడికతీత
– పనులను పర్యవేక్షించిన కమిషనర్, డీఈ
– ఈ నెల 15వ తేదీకి పనులు పూర్తి
మదనపల్లె: మున్సిపల్ పరిధిలోని బాహుదా కాలువలో పూడికతీత పనులను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదట పనులు చేసేందుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందనే అంచనా వేశారు. అది ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ఈ పనులను శనివారం కమిషనర్ విశ్వనాథ్ పర్యవేక్షించారు. ఆయన మట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 12 జేసీబీలు, 36 ట్రాక్టర్లతో పూడికతీత పనులు చేపట్టామన్నారు. రోజుకు దాదాపు 70 మీటర్ల చొప్పున పూడికతీత తీస్తున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీకల్లా బాహుదా, ముగ్గురాళ్ల వంకలో పూడికతీత పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని చెప్పారు. వందేళ్ల తర్వాత బాహుదాలో పూడికతీత పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంట డీఈ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.