చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
కొవ్వూరు : మద్దూరు గ్రామంలో గత జూలై 25న ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. గురువారం రాత్రి కొవ్వూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన షేక్ వలీబాబా(వలీ) గత జూలైలో మండలంలోని మద్దూరులో నున్న బుల్లిరాజు అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే వలీ వలీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఓచోరీ కేసులో పట్టుబడ్డాడు. విచారణలో మద్దూరులోనూ తాను చోరీ చేసినట్టు చెప్పాడు. దీంతో అతడిని కోర్టు అనుమతితో బుధవారం తాము కస్టడీకి తీసుకుని విచారించామని, దీంతో అతను చోరీ చేసింది తానేనని అంగీకరించాడు. దొంగిలించిన వెండి వస్తువులు ఒక కండువాలో మూటకట్టి మద్దూరు–చంద్రవరం రోడ్డులో ఉన్న మద్దిపాటి నరసింహామూర్తి గడ్డిమేటులో దాచినట్టు చెప్పాడు. ఏడు కాసుల బంగారు అభరణాలను మణప్పురం సంస్థలో తాకట్టుపెట్టినట్టు వివరించాడు. దీంతో పోలీసులు రూ.రెండులక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనంచేసుకున్నారు.