వెండి ఉచ్చు
యువతను పావులుగా వాడుకుంటున్న వైనం
ప్రతి గురువారం గుట్టుచప్పుడు కాకుండా రవాణా
విద్యార్థుల్లా బ్యాగుల్లో తరలించి, దుకాణాల్లో విక్రయం
వాణిజ్య పన్నుల శాఖకు రూ.లక్షల్లో ఆదాయానికి గండి
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. వెండి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇందుకోసం అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతూ, యువతను పెడతోవ పట్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం అమలాపురం బస్టాండ్ వద్ద 34 కిలోల వెండి వస్తువులను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు యువకులు పట్టుబడగా, ఇలాంటి యువకులెందరో ఈ అక్రమ దందాలో పావులుగా మారుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది.
– అమలాపురం టౌన్
ప్రతి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఓ బడా వెండి, బంగారు వ్యాపారి కోనసీమలోని అమలాపురం, రాజోలు, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, తాటిపాక తదితర ప్రాంతాలకు ఖరీదైన కార్లలో, చురుకైన యువకుల ద్వారా అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒక్క గురువారం మాత్రమే ఈ రవాణా గుట్టుగా చేస్తారు. గత గురువారం కారులో వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠా పి.గన్నవరంలో ఓ దుకాణదారునికి వాటిని విక్రయిస్తుండగా, వారి మధ్య బేరసారాల విషయమై గొడవ జరిగింది. ఆ ముఠా అక్కడ నుంచి కారులో అమలాపురం బయలుదేరింది. పి.గన్నవరం వ్యాపారి ఈ అక్రమ రవాణా సమాచారాన్ని పట్టణ పోలీసులకు ఫోన్లో అందించారు. దీంతో అమలాపురం బస్స్టేçÙన్ వద్ద పోలీసులు నిఘా ఉంచి, వారిని పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది.
దుకాణాలకు చేరేదిలా..
నర్సాపురం నుంచి చించినాడ వంతెన మీదుగా ఖరీదైన కార్లలో, విద్యార్థుల్లా ఉండే కొందరుæయువకులతో కారు సీట్లు లోపల ఉండే రహస్య అరల్లో వెండి, బంగారు వస్తువులు దాచి తరలిస్తారు. వారు వెళ్లిన చోట ఇద్దరు యువకులు బ్యాగుల్లో వెండి, బంగారు వస్తువులను పెట్టుకుని, కాలినడకన దుకాణాలకు వెళతారు. అభరణాలను అక్కడికక్కడే అమ్మి, నగదు కూడా తక్షణమే తీసుకుంటారు. ఫోన్లలో మాటలు ముందుగా జరిగిపోవడంతో, పనులన్నీ చకచకా సాగిపోతాయి. కోనసీమలో ఈ అక్రమ రవాణా వల్ల వాణిజ్య పన్నుల శాఖకు పన్ను ఎగవేత ద్వారా రూ.లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది.
నిఘా మరింత పెంచుతాం
పన్ను చెల్లింపు లేకుండా జరుగుతున్న వెండి వస్తువుల అక్రమ రవాణాపై ఇక నుంచి మరింత నిఘా పెడతాం. ఇప్పటికే అక్రమ రవాణాతో పన్నులు ఎగవేసే వారిపై చెక్ ఆఫ్ వెహికలర్ ట్రాఫిక్ విధానంతో మూడు దశల్లో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. మాకు గూడ్స్ వెహికల్స్ను ఆపి తనిఖీ చేసే అధికారం మాత్రమే ఉంది. కార్లను ఆపి, తనిఖీ చేసే అధికారం లేదు. కార్లలో వెండి వస్తువులను అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిఘా పెంచుతాం.
– కృష్ణప్రసాద్, డీసీటీఓ(అమలాపురం రూరల్)