సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరు రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఒత్తిళ్లకు లోనై అత్యుత్సాహంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తీసుకుకొచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజల రక్షణకు కేంద్రం ఈ చట్టంలో కొన్ని రక్షణ చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా గత ఏడాది కాలంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని, ఆ ఘటనలు ప్రజల జీవించే హక్కును కాలరాసే విధంగా ఉన్నాయని వివరించారు.