శింబు, అనిరుద్‌లపై చర్యలు తీసుకోండి
చెన్నై: నటుడు శింబు, అనిరుద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పాట్టాలీ మక్కల్ కచ్చి చెన్నై సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళలను అవమానించే విధంగా పాటను రాసి, పాడారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లపై విమర్శలు, పిర్యాదు,కేసులు పెరిగిపోతున్నాయి. మరో పక్క రాష్ట్ర నలు మూలల నుంచి మహిళా సంఘాల ఆందోళనలు అధికం అవుతున్నాయి. శింబు, అనిరుధ్‌లపై ఇప్పటికే కోవై రేస్ కోర్స్ పోలీసులు వీరిపై నాలుగు విభాగాల్లో కేసులు నమోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.
శనివారం పోలీస్‌స్టేషన్‌లో నేరుగా హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పీఎంకే చెన్నై చిల్లా కార్యదర్శి వెంకటేశన్ స్థానిక సైదాపేట కోర్టులో శింబు,అనిరుద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ నెల 28న విచారించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.