మాంచెస్టర్‌ను ఓడిస్తాం
సైమన్ మిగ్నోలెట్ ఇంటర్వ్యూ
బెల్జియం స్టార్ ఆటగాడు సైమన్ మిగ్నోలెట్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లివర్‌పూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గోల్‌కీపర్ తమ జట్టు ఈ సారి టైటిల్ సాధిస్తుందనే ధీమాతో ఉన్నాడు. సహచరుడు లోరిస్ కరియస్ కోసం ఆరంభ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఇతను కొత్త ఏడాదిలో తమ జట్టు విజయాలతో దూసుకెళుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఇంకా అతను ఏమన్నాడంటే...
విజయంతో ఈ ఏడాదికి ముగింపు పలుకుతారా?
అవును... జట్టు సభ్యులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మాంచెస్టర్ సిటీతో శనివారం జరిగే మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదల వారిలో ఉంది. అంతేకాదు ఈ సీజన్లో టైటిల్ గెలిచే అవకాశాలు కూడా మాకే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం కూడా తెలుసు.
మాంచెస్టర్ సిటీతో కీలకమైన మ్యాచ్‌లో మీరు ప్రతీకారం తీర్చుకుంటారా?
తీర్చుకోవాలని ఉంది. అయితే ముందుగా గట్టిపోటీపైనే మా దృష్టి ఉంది. తర్వాత ఒక్కో మ్యాచ్ విజయం... అనంతరం టైటిల్ వేటలో సఫలమవడం మా టార్గెట్. ఈపీఎల్ టైటిల్‌తో నా కలను సాకారం చేసుకోవాలనుంది. దీనికోసం చాలా కష్టపడాలి. అభిమానుల అంచనాలను చేరుకోవాలని, వారి నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఉన్నాం.
ఈ ఏడాది వ్యక్తిగతంగా మీకు, అలాగే మీ జట్టుకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఈ ఏడాది నేను ఎన్నో సాధించాలనుకున్నా... అనుకున్నవన్నీ కుదరలేదు. లీగ్ కప్‌లో ఫైనల్‌కైనా చేరాం. అయితే చాంపియన్స్ లీగ్‌లో నిరాశపరిచాం. కానీ జట్టుగా కొన్ని మంచి ఫలితాలు లభించాయనే సంతోషంగా ఉంది.
మీ ఫుట్‌బాల్ కెరీర్లో మంచి రోజని చెప్పుకోవాలంటే... ఏదని చెబుతారు?
బెల్జియం గోల్ కీపర్‌గా నా కెరీర్లో తీపి గుర్తులెన్నో ఉన్నాయి. కానీ లివర్పూల్లాంటి జట్టుతో ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన రోజు ఎంతో ప్రత్యేకమైంది. దాన్నెపుడూ మరచిపోలేను.
ఈ సీజన్లో మీ జట్టు తరఫున ఉత్తమ క్రీడాకారుడు ఎవరు?
ప్రత్యేకంగా ఒకరు అని చెప్పలేం. జట్టులో అందరూ బాగానే ఆడుతున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఫిలిఫ్ కుటినో అందరిలో ముందుంటాడు.