శివసేనలోకి ఎన్సీపీ ఎమ్మెల్యే!
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రత్నగిరి సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శివసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత శివసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా దీపక్ కేసర్కర్ శివసేనలో చేరనున్నారనే వార్తలను బలపరిచేలా కనిపిస్తున్నాయి. రత్నగిరి-సింధుదుర్గాలో నారాయణ రాణే కుమారుడైన సిట్టింగ్ ఎంపీ నీలేష్ రాణేను వినాయక్ రావుత్ ఓడించారు.
ఎన్నికలకు ముందు ఉద్ధవ్‌ఠాక్రే ప్రచారంలో కూడా కేసర్కర్పై పెద్దగా ఎన్నడూ విమర్శలు చేయలేదు. వినాయక్ రావుత్ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసర్కర్ మహాకూటమి టికెట్‌పై పోటీ చేస్తే మంత్రి పదవి కూడా లభిస్తుందని చెప్పారు. దీన్నిబట్టి ఆయనను చేర్చుకునేందుకు శివసేన కూడా ఆసక్తిగా ఉందని, వినాయక్ రావుత్ విజయానికి ఆయన కూడా పరోక్షంగా లాభం చేకూర్చినట్టు తెలుస్తోంది.