వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా (39) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారిపై చేసిన పోరాటానికి గాను సింగపూర్ ప్రముఖ దినపత్రిక ది స్ట్రెయిట్స్ టైమ్స్ అందించే “ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకి ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఈ ఘనతను సాధించిన ఆరుగురిలో ఒకరిగా పూనావాలా నిలిచారు.(ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన)
కరోనాపై పోరులో వారి ధైర్యం, నిబద్ధత, క్రియేటివిటీకి సాల్యూట్ చెబుతున్నామంటూ సింగపూర్ డెయిలీ కితాబిచ్చింది. ఈ సంక్షోభ సమయంలో విశేష కృషితో ఆసియాతోపాటు ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచారని వ్యాఖ్యానించింది. మొత్తం ఆరుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో పనిచేసిన వీరులుగా వీరిని "వైరస్ బస్టర్స్"గా అవార్డు ప్రశంసాపత్రంలో కీర్తించింది. ఈ జాబితాలో పేర్కొన్న మరో ఐదుగురిలో చైనా పరిశోధకుడు కరోనా మహమ్మారి వైరస్ సార్స్-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు చాంగ్ యోంగ్జెన్, మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కృషి చేసినందుకుగాను చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. నిబద్ధతతో తమకు తాము అంకితమైన కృషితో ఆసియాతోపాటు, ప్రపంచ ప్రజలకు ఆశలను చిగురింప చేశారని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారెన్ ఫెర్నాండెజ్ ప్రశంసించారు. ఇంతకుముందెన్నడూ లేని కృషితో వార్తల్లో నిలవడంతోపాటు, తద్వారా ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి నివారణకు పరిష్కారానికి సమాధానం కనుగొనడంలో సాయం చేసిన వ్యక్తులకు, టీంలకు ఇవ్వాలని నిర్ణయించింది.
కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిడ్-19వ్యాక్సిన్ ‘‘కోవిడ్‌షీల్డ్’’ తయారీకి తయారీకి పూణేకు చెందిన సీరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ప్రజలకు విముక్తి రావాలనే ఉద్దేశంతో తన సంస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి తన కుటుంబ సంపదలో 250 మిలియన్ డాలర్లను అందించినట్టు ఇటీవల వెల్లడించారు. ప్రధానంగా స్వల్ప, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలో కోవిడ్-19వాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. 1966లో పూనవాలా తండ్రి సైరస్ పూనావాలా సీరంను స్థాపించారు. ఆ తరువాత 2001లో సీరంలో చేరిన అదర్ పూనావాలా దినదినాభివృద్ధి చెందుతూ 2011లో సీఈవోగా అవతరించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.