
ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా నరేంద్ర మోదీ!
సింగపూర్: ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. భారత అభివృద్ధి నాయకత్వం అందించినందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన ‘ది స్ట్రైట్ టైమ్స్’ దినపత్రిక ప్రకటించింది. ప్రధాని పదవికి మోదీ కొత్తయినా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్‌లతోపాటు పలువురు నేతలను కలిసి ఆసియాలో తనదైన ముద్ర వేయగలిగారంది.
మోదీ జపాన్ పర్యటన, జపాన్ ప్రధాని అబేతో ఆయన సమావేశం విజయవంతమయ్యాయని ఆ పత్రిక ప్రచురణకర్త సింగపూర్ ప్రెస్ హోల్డింగ్ లిమిటెడ్ పేర్కొంది. దేశప్రజలకు ఆయన సరైన దిశ, దశ చూపించగలిగారని, భారత అభ్యున్నతిపట్ల ప్రపంచదేశాల్లో అంచనాలు పెంచగలిగారని తెలిపింది. మోదీ అందించిన ‘మేకిన్ ఇండియా’ పిలుపు దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని పత్రిక సంపాదకుడు చెప్పారు.