Singapore Open Tournament
-
సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..!
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్లో ఓడిపోయింది.అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా వాంగ్ జి యి చివరి వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది. ఇక పీవీ సింధుకు ఈ ఏడాది సీజన్లో ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్‌లో సూపర్ 300 టైటిల్స్‌ను సింధు సాధించింది. ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్‌గా సింధు రికార్డులకెక్కింది. కాగా గతంలో 2010లో సైనా సెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చదవండి: Commonwealth Games 2022: 322 మందితో కూడిన జంబో టీమ్‌ను ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం SHE DID IT 👑@Pvsindhu1 went all guns blazing against 🇨🇳's Wang Zhi Yi to beat her 21-9, 11-21, 21-15 & win her 3rd title of the year at #SingaporeOpen2022 🏆🥇 Congratulations champ! 🥳 Picture Credit: @bwfmedia @himantabiswa @sanjay091968 #IndiaontheRise#Badminton pic.twitter.com/BIcDEzCz9z — BAI Media (@BAI_Media) July 17, 2022 -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు, హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ కూడా క్వార్టర్స్ చేరారు. అయితే సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్.ప్రణయ్లిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెమటోడ్చిన సైనా మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 21–16, 18–21, 21–19తో థాయ్‌లాండ్‌కు చెందిన పొర్న్‌పవి చొచువాంగ్‌పై చెమటోడ్చి గెలిచింది. ఇటీవల మలేసియా ఓపెన్‌లో థాయ్ షట్లర్ చేతిలో తనకెదురైన పరాజయానికి హైదరాబాదీ స్టార్ బదులు తీర్చుకుంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనాకు 21వ ర్యాంకులో ఉన్న చొచువాంగ్ గట్టిపోటీనిచ్చింది. మూడు గేమ్‌ల వరకు హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సైనా పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 21–13, 21–19తో మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)ను వరుస గేముల్లో కంగుతినిపించింది. కేవలం 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–12, 23–21తో డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టిన్ సోల్బెర్గ్పై గెలుపొందగా, సమీర్ వర్మ 21–15, 21–18తో లు గ్వాంగ్జూ (చైనా)పై అలవోక విజయం సాధించాడు. పోరాడి ఓడిన కశ్యప్ పారుపల్లి కశ్యప్‌కు 9–21, 21–15, 16–21తో నాలుగో సీడ్ చెన్‌లాంగ్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ భారత సీనియర్ షట్లర్... చైనా సీడెడ్ ఆటగాడికి గట్టిపోటీ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) 21–11, 21–11తో వరుస గేముల్లోనే హెచ్.ఎస్.ప్రణయ్ ఆటకట్టించాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–17, 6–21, 21–19తో హాంకాంగ్‌కు చెందిన ఐదో సీడ్ తంగ్ చున్ మన్– సె యింగ్ సుయెట్ జంటకు షాకిచ్చింది. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్
సింగపూర్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. ర్యాంకింగ్స్‌లో దిగువన ఉండటంతో అతను క్వాలిఫయింగ్ ఈవెంట్లో పోటీపడ్డాడు. మంగళవారం రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన కశ్యప్ మెయిన్ డ్రా పోటీలకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ తొలి రౌండ్లో ఈ భారత వెటరన్ షట్లర్ 21–5, 14–21, 21–17తో మలేసియాకు చెందిన చిమ్ జున్ వీపై గెలుపొందాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 15–21, 21–16, 22–20తో జపాన్ ఆటగాడు యు ఇగరషిపై చెమటోడ్చి నెగ్గాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ముగ్ధా ఆగ్రే కూడా మెయిన్ డ్రాకు అర్హత పొందింది. ఆమె క్వాలిఫయింగ్‌లో 16–21, 21–14, 21–15తో అమెరికా షట్లర్ లారెన్ లామ్పై గెలిచింది. నేడు జరిగే ప్రధాన డ్రా తొలి మ్యాచ్‌లో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో కశ్యప్, పోర్న్‌పవి చొచువాంగ్ (థాయ్‌లాండ్)తో ముగ్ధా ఆగ్రే పోటీపడతారు. పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో ఎం.ఆర్. అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీ 11–21, 18–21తో ఆరో సీడ్ కిమ్ అస్ట్రప్–అండర్స్ స్కారప్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడింది. ఈ రోజు జరిగే మెయిన్ డ్రా పోటీల్లో భారత స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. -
సింధు సింగపూర్‌లో సాధించేనా..!
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో నిరాశపరిచింది. ఆల్ ఇంగ్లండ్ సహా పలు ఈవెంట్లలో బరిలోకి దిగిన ఆమె ఇంకా టైటిల్ బోణీనే కొట్టలేదు. ట్రోఫీల వెలతి వేధిస్తున్న ఈ ఒలింపిక్ రన్నరప్ తాజాగా సింగపూర్ ఓపెన్‌లో సత్తాచాటాలని ఆశిస్తోంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌లో సింధు నాలుగో సీడ్‌గా, సైనా నెహ్వాల్ ఆరో సీడ్‌గా తమ ఆట ప్రారంభిస్తారు. నిరీక్షణ ముగిసేనా... గత డిసెంబర్లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తెలుగుతేజం సింధుకు కొత్త సంవత్సరం ఇప్పటిదాకా కలిసిరాలేదు. ఇండోనేసియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లో ఓడిన ఆమె... ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో అయితే తొలిరౌండ్లోనే కంగుతింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్ చేరికే ఇప్పటివరకు ఆమె ఉత్తమ ప్రదర్శన కాగా... ఆదివారమే ముగిసిన మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. నాలుగో సీడ్ సింధు ఈ టోర్నీలో తన నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆమె ఇండోనేసియాకు చెందిన లియాని అలెసాండ్రా మయినకితో తలపడుతుంది. ఈ సీజన్లో టైటిల్ సాధించిన ఏకైక భారత షట్లర్ సైనా నెహ్వాల్. 29 ఏళ్ల హైదరాబాదీ వెటరన్ స్టార్ ఇండోనేసియా ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో మారిన్ గాయంతో వైదొలగడంతో హైదరాబాదీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆల్ ఇంగ్లండ్‌లో క్వార్టర్స్ చేరిన ఆమె అనారోగ్య కారణాలతో స్విస్, ఇండియా ఓపెన్లకు దూరంగా ఉంది. తిరిగి మలేసియా ఈవెంట్లో ఆడినప్పటికీ తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్ సైనా తొలిరౌండ్లో లిన్ హొజ్మర్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడుతుంది. క్వాలిఫయర్‌తో శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ టచ్‌లోకి వచ్చాడు. ఇండియా ఓపెన్‌లో ఫైనల్ చేరడం ద్వారా 17 నెలల అనంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మలేసియా ఓపెన్‌లో ఈ భారత షట్లర్ క్వార్టర్స్ చేరాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న శ్రీకాంత్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనున్నాడు. భమిడిపాటి సాయిప్రణీత్‌కు తొలిరౌండ్లోనే క్లిష్టమైన పోటీ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ కెంటో మొమొట (జపాన్)తో అతను తలపడనున్నాడు. హెచ్.ఎస్. ప్రణయ్‌కి బ్రిస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) ఎదురయ్యాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్ మలేసియాకు చెందిన చిమ్ జున్ వీతో ఆడతాడు. వీరితో పాటు పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి, ఎం.ఆర్.అర్జున్– శ్లోక్ రామచంద్రన్, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్, మనీషా–అర్జున్, అనుష్క–సౌరభ్ వర్మ జోడీలు ఈ టోర్నీ బరిలో ఉన్నాయి. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
∙ శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా... ∙ సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ సిటీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగుతేజం సింధు చెమటోడ్చి నెగ్గింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె 19–21, 21–17, 21–8తో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియాని ఫిత్రియానిపై గెలిచింది. క్వార్టర్స్‌లో సింధు... కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 18–21, 21–19, 22–20తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)పై శ్రమించి నెగ్గాడు. భమిడిపాటి సాయిప్రణీత్ కూడా 21–15, 21–23, 21–16తో కియావో బిన్ (చైనా)పై చెమటోడ్చి గెలిచాడు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్... ఐదో సీడ్ షి యుకి (చైనా)తో, సాయిప్రణీత్... తనోంగ్సక్ సెన్సోంబున్సుక్ (థాయ్‌లాండ్)తో తలపడతారు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సుమీత్ రెడ్డి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 17–21, 21–17, 21–16తో జె హాన్ కిమ్– లి సో హి (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని ద్వయం 11–21, 21–19, 12–21తో టాప్ సీడ్ మిసాకి మత్సుతొమొ–అయక తకహషి (జపాన్) జోడి చేతిలో కంగుతింది. ఐదుకు పడిపోయిన సింధు ర్యాంకు న్యూఢిల్లీ: సింధు కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకు వారం రోజుల ముచ్చటే అయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంకుకు పడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో ఆమె మూడు స్థానాలు దిగజారింది. మలేసియా ఓపెన్‌లో 21 ఏళ్ల సింధు తొలి రౌండ్లోనే కంగుతినడంతో టాప్–2 ర్యాంకును కోల్పోయింది. సైనా కూడా అదే టోర్నీలో మొదటి రౌండ్లోనే ఓడినా... ఆమె తొమ్మిదో ర్యాంకు మాత్రం మారలేదు. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మిగతావారెవరూ టాప్–20 జాబితాలో లేరు. -
శ్రీకాంత్ సత్తాకు సవాల్
► వైదొలిగిన సైనా నెహ్వాల్ ► బరిలో సింధు, ప్రణయ్, జయరామ్ ► నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మరో మూడు వారాల సమయం... మరో మూడు టోర్నీలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత స్టార్ సైనా నెహ్వాల్ మినహా... మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. గత రెండు సూపర్ సిరీస్ టోర్నీలు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్లలో తొలి రౌండ్లోనే ఓడిన ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు సింగపూర్ ఓపెన్‌లోనూ క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నెగ్గితే రెండో రౌండ్లో ఆరో సీడ్ తియాన్ హువీ (చైనా) లేదా టకుమా ఉయెదా (జపాన్)లతో ఆడాల్సి ఉంటుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్; మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో అజయ్ జయరామ్ ఆడతారు. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో జుల్ఫాది జుల్కిఫి (మలేసియా)తో గురుసాయిదత్; హెన్రికో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ ఆడతారు. గతవారం ముగిసిన మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిన సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి కూడా ఎంట్రీని పంపించింది. తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా ఆడాల్సింది. అయితే చివరి నిమిషంలో సైనా వైదొలగడంతో ఆమె స్థానాన్ని ఆయా ఓరి (జపాన్)తో భర్తీ చేశారు. సైనా వైదొలగడంతో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది. బుధవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. బుసానన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో సింధు గెలిస్తే రెండో రౌండ్లో ఏడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా హీ బింగ్జియావో (చైనా)లతో ఆడుతుంది. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్, సాయిప్రణీత్
సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ : అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతారలు గురుసాయిదత్, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ తొలిరౌండ్లో 18-21, 21- 18, 21-18తో బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై నెగ్గి... రెండో రౌండ్లో 21-9, 21-13తో జూ వీ వాంగ్ (చైనీస్ తైపీ)ను ఓ డించాడు. మరోవైపు సాయిప్రణీత్ తొలి రౌండ్లో 18-21, 21-18, 21-12తో రాస్ముస్ ఫ్లాడ్బెర్గ్ (డెన్మార్క్)పై గెలుపొంది... జుల్ఫాది జుల్కిఫ్లి (మలేసియా)తో రెండో రౌండ్లో 11-6 తో ఆధిక్యంలో ఉన్నపుడు అతని ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సిక్కి-తరుణ్ జంట 21-11, 21-12తో జియాన్ లియాంగ్ లీ-జియా యింగ్ వోంగ్ (సింగపూర్) ద్వయంపై, రెండో రౌండ్లో 21-11, 21-17తో మహ్మద్ రాజిఫ్ లతీఫ్-సనాతాసా సనిరూ (మలేసియా) జోడీపై గెలిచింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో కిడాంబి శ్రీకాంత్; లీ హున్ (కొరియా)తో పారుపల్లి కశ్యప్; వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో ప్రణయ్; సన్ వాన్ హో (కొరియా)తో గురుసాయిదత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతారు.