బ్రస్సెల్స్ లో ప్రముఖ గాయకుడి కుటుంబం
ముంబై: బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్ల ఘటనతో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య కుటుంబం అక్కడ చిక్కుకుంది. దీంతో అభిజిత్ ఆందోళనలో పడ్డారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
బెల్జియం రాజధానిలోని విమానాశ్రయంలో పేలుళ్ల వార్త తనకు చాలా బాధ కలిగించిందని అభిజిత్ అన్నారు. పేలుళ్లు జరిగిన విమానాశ్రయంలో తమ వారు చిక్కుకోవడం చాలా ఆందోళన కలిగించిందని మీడియాకు తెలిపారు. అదృష్టవశాత్తూ వారు క్షేమంగా ఉండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అటు బెల్జియన్ ప్రధాన మంత్రి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ తమ దేశంలో ఇవి విషాద క్షణాలనీ, ప్రశాంతంగా , ఐక్యంగా ఉండడం అవసరమన్నారు. బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పలువురు స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెస్సెల్స్ పేలుళ్ల ఘటన తనను షాక్ కు గురిచేసిందన్నారు. తాము చేయగలిగిన సహాయాన్ని అందిస్తామంటూ ట్విట్ చేశారు.