breaking news
Singer Shravana Bhargavi
-
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్‌లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్‌తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్‌ని సోషల్‌మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్‌లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్‌లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్‌గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్‌లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్‌గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్‌లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్‌లైన్‌లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్‌గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా, మరింత క్రియేటివ్‌గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్‌గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్‌కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్‌గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి -
సంగీతం హాబీగా నేర్చుకున్నా...
సింహా చిత్రంలో ‘సింహమంటి చిన్నోడే..’, కెమెరామెన్ గంగతో రాంబాబులో ‘జర్రమెచ్చింది..’, తీన్మార్లో ‘అలేబాలే..’ అంటూ శ్రావణభార్గవి ఆలపించిన పలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టించాయి. గాయకురాలిగానే కాకుండా యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో దూసుకెళుతున్నారు ఆమె. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్న సహ గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం హనుమాన్ జంక్షన్ వచ్చిన శ్రావణభార్గవి కొద్దిసేపు... న్యూస్‌లైన్ : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? భార్గవి : నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న శివకుమార్ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. అమ్మ అరుణ గృహిణి. న్యూ : శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారా? భార్గవి : హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన బి.లలిత గారి వద్ద ఐదేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. ఏదో హాబీగా నేర్చుకుందామని చేరిన తర్వాత సంగీతంపై ఆసక్తి పెరిగి గాయనిగా నిలదొక్కుకోవాలని నిశ్చయించుకున్నా. న్యూ : మీరు పాట పాడిన తొలి చిత్రం ఏది.. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో పాడారు? భార్గవి : రమణ గోగుల సంగీత దర్శకత్వంలో 2009లో విడులైన ‘బోణి’ చిత్రంలో తొలి పాట పాడాను. ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాల్లో పాడాను. సింహా, తీన్మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, రాజన్న, దమ్ము తదితర చిత్రాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రేయ్’ చిత్రం, రఘు కుంచె సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రంలోని పాటలు పాడాను. న్యూ : హేమచంద్రతో ప్రేమ ఎలా మొదలైంది? భార్గవి : 2009లో రైడ్ సినిమాకు పాట పాడే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తరుచూ మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో స్నేహం మరింత పెరిగింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నాం. న్యూ : సినీ పరిశ్రమలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? భార్గవి : పాపులర్ పాటను ఆలపించి సింగర్‌గా పేరు తెచ్చుకోవటం సాధారణ విషయమే... కానీ శ్రావణ భార్గవి పాటనే పాపులర్ చేసే సింగర్.. అంటూ ఇద్దరు, ముగ్గురు పరిశ్రమ పెద్దలు అభినందించటం మర్చిపోలేనిది.


