భార్యతో విడిపోయాక నాకు ఫోన్‌కాల్స్!
- గుట్టు విప్పిన టాప్ హీరో మాజీ ప్రియురాలు
లాస్ఏంజిల్స్: గత ఏడాది ప్రపంచ సినీప్రయులను ఆశ్చర్యానికి గురిచేస్తూ హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్ తన రెండో భార్య ఏంజిలీనా జోలీ నుంచి విడాకులు తీసుకున్నాడు. సినీ రంగానికి సంబంధించి 2016లో ఎక్కువమంది చదివిన వార్తకూడా పిట్-జోలీ డైవర్స్‌కు సంబంధించిదేకావడం గమనార్హం. అయితే జోలీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోన్న 53 ఏళ్ల బ్రాడ్‌పిట్.. తన మాజీ గర్ల్‌ప్రెండ్, గాయని సినిట్టాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడట. త్వరలోనే టీవీల్లో ప్రసారంకానున్న ఓ టాక్ షోలో సినిట్టాయే స్వయంగా ఈ ముచ్చట చెప్పింది.
‘బ్రాడ్‌పిట్ చాలా రొమాంటిక్. మేం విడిపోయి చాలా ఏళ్లు అవున్నా.. అతనితో గడిపిన రోజులు నాకింకా గుర్తేఉన్నాయి. ఈ మధ్యే భార్య నుంచి విడిపోయిన అతను నాకు ఫోన్‌కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. అఫ్కోర్స్ నేను కూడా ఒంటరినే! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేను పిట్తో కలిసి ఉండలేను. అందుకే.. నన్ను కాకుండా ఇంకెవరినైనా చూసుకొమ్మని సలహా ఇచ్చా’ అని సినిట్టా చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభంలో సినిట్టాతో డేటింగ్చేసిన బ్రాడ్‌పిట్.. ఆమెతో బంధాన్ని బ్రేకప్ చేసుకుని నటి జెన్నీఫర్ అనిస్టీన్ను పెళ్లాడాడు. అదే సమయంలో సినిట్టా.. ఆండీ విల్నర్ను మనువాడింది. అయితే 2005 నాటికి ఈ రెండు జంటలూ విడిపోయాయి. జెన్నీఫర్ నుంచి విడిపోయిన బ్రాడ్‌పిట్.. ఏంజిలీనా జోలీని పెళ్లాడటం, ఆరుగురు పిల్లల్ని కలిగాక మొన్నీమధ్యే విడిపోవడం తెలిసిందే. సినిట్టా మాత్రం మొదటి విడాకుల తర్వాత నుంచీ ఒంటరిగానే జీవిస్తోంది.