సింగింగ్ బ్యూటీస్
ఓ పక్క తమ నటనతో అలరిస్తూనే మరోపక్క గాయని అవతారమెత్తారు ఎంతోమంది బాలీవుడ్ నటీమణులు. శ్రీదేవి, జూహీచావ్లా, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లంతా ఆ కోవకు చెందినవారే.
అయితే ప్రస్తుతం కొందరు హీరోయిన్లు సింగింగ్ను సరదాగా కాకుండా సీరియస్‌గా తీసుకుంటున్నారు.
గాయనీమణులుగా ముద్ర వేయించుకోవాలని తపిస్తున్నారు. వారే వీరు...
ముద్దుగా, ముచ్చటగా కనిపించే ఆలియాలో ఓ మంచి సింగర్ ఉందన్న సంగతి రెహమాన్ కనిపెట్టారు. ‘హైవే’ సినిమాలో ‘సూహా సూహా’ అనే పాట పాడించి, ఆమె టాలెంట్‌ని అందరికీ తెలిసేలా చేశారు. ఆ తర్వాత ‘హప్టీ శర్మాకీ దుల్హనియా’లో ‘సమ్ఝావా’ పాటతో సింగర్‌గా నిరూపించేసుకుంది ఆలియా. ఆ పాట వీడియో అయితే కుర్రకారుకి యమా కిక్కిచ్చింది. త్వరలో మరో సినిమాలో కూడా గొంతు సవరించబోతోందట ఈ చిన్నది.
సోనాక్షికి సంగీతమంటే పిచ్చి. చక్కగా పాడగలదు కూడా. తన సినిమాకి తాను పాడుకోవాలన్న ఆశ ఆమెలో ఎప్పట్నుంచో ఉంది. ‘లూటేరా’ చిత్రంలోని ‘సవార్లూ’ పాట పాడాలని ఉవ్విళ్లూరింది కానీ అది నెరవేరలేదు. చివరికి ‘తేవర్’లో ‘లెట్స్ సెలెబ్రేట్’ అంటూ సింగేసి సరదా తీర్చుకుంది. త్వరలో ఇండియన్ ఐడల్ జూనియర్స్‌కి జడ్జిగా కూడా వ్యవహరించబోతోంది. అప్పుడు తను కూడా పిల్లలతో పాటు పాటలు పాడేయవచ్చు అంటూ సరదాపడుతోంది సోనాక్షి.
‘ఏక్ విలన్’ చిత్రంలో ‘గలియా’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందంటే... ఆ సినిమా రిలీజయ్యాక అందరినోటా ఆ పాటే. ఆ పాటలోని ఫిమేల్ వాయిస్ శ్రద్ధాకపూర్‌ది అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. ‘ఆషికీ 2’లో సింగర్‌గా నటించిన శ్రద్ధలో నిజంగానే గాయని ఉందన్న విషయం ఆ పాటతో అర్థమయ్యింది. శ్రద్ధ తల్లి శివంగీ కొల్హాపురి, లతామంగేష్కర్‌కి దగ్గరి బంధువు. ఆ జీన్సే శ్రద్ధకీ వచ్చినట్టు న్నాయి.
సరదాగా తన సినిమాలో పాడటం కాకుండా, ఏకంగా ఓ పాటల ఆల్బమ్నే రిలీజ్ చేసిన ఘనత ప్రియాంకాచోప్రాది. ఆమె పాటలు పాడిన ‘ఎగ్జాటిక్’ ఆల్బమ్... అప్పటికే నటిగా పేరెన్నికగన్న ఆమెని సింగర్‌గా కూడా ప్రపంచం ముందు నిలబెట్టింది. నిజానికి 2002లోనే తమిళంలో తాను నటించిన తొలి సినిమాలో పాడింది ప్రియాంక. ఆ తర్వాత నటన మీద దృష్టి పెట్టడంతో ఏ సినిమాలోనూ పాడలేదు. ఆ మధ్య వచ్చిన ‘మేరీ కోమ్’లో ఆమె పాడిన ‘చావోరో’ బాలీవుడ్లో ఆమె తొలి పాట. ముందు ముందు మరిన్ని పాటలు పాడబోతోందట ప్రియాంక.