బోనాలకు ముమ్మర ఏర్పాట్లు
యాకుత్‌పురా: బోనాల పండుగ సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన పాతబస్తీలోని ప్రధాన ఆలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం బేలా ముత్యాలమ్మ, గౌలిపురా మహంకాళి, లాల్‌దర్వాజా సింహవాహిణి ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోనాల పండుగ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ఇందులో భాగంగా రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయం, ఢిల్లీలో నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం అందించామన్నారు. బోనాల పండుగ, ఘటాల ఊరేగింపు రోజున ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 30, 31, ఆగస్టు 1వ తేదీల్లో మంచినీటిని సరఫరా చేయాలని జలమండలిని ఆదేశించినట్లు తెలిపారు. దమయంతి తివారీ టవర్స్, నయాపూల్ వద్ద్ద త్రీ డీ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తులో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలపై ప్రతి సినిమా థియేటర్లో మూడు నిమిషాల పాటు ప్రసారాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి,అదనపు డీసీపీ బాబురావు, జలమండలి, ట్రాన్స్‌కో, ఆర్అండ్బి, సాంసృ్కతిక శాఖ, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సింహవాహిణికి 70 తులాల రజత హారం
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారికి హనుమాన్ చారి అనే స్వర్ణకారుడు 70 తులాల వెండి పూల దండను కానుకగా సమర్పించారు. హనుమాన్ చారి 45రోజుల పాటు స్వయంగా ఈ పూలదండను తయారు చేశాడు. బుధవారం ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అలంకరించారు. గతేడాది అమ్మవారికి సమర్పించిన బంగారు కిరీటాన్ని తయారు చేసింది హనుమాన్ చారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహయ్య శర్మ, కార్తీకేయ శర్మ ఆయనను ఘనంగా సన్మానించారు.
29న 1100 మంది మహిళలచే మహా కుంకుమార్చన.
బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29న ఆలయంలో 1100 మంది మహిళా భక్తులతో మహా కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విడతల వారీగా కుంకుమార్చన చేస్తారన్నారు. కార్యక్రమానికి మహిళా భక్తులు తరలిరావాలని కోరారు. అదే రోజు అమ్మవారికి ఢిల్లీ మిఠాయి వాటిక ఆధ్వర్యంలో చప్పన్‌బోగ్ (56రకాల మిఠాయిలు) నైవేద్యాన్ని సమర్పించనున్నామన్నారు.