పేదలకే సబ్సిడీలు చేరేలా కొత్త వ్యవస్థ
న్యూఢిల్లీ: అర్హులైన పేదలకు మాత్రమే చేరేలా సబ్సిడీల పంపిణీకి కొత్త వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సబ్సిడీలను ఎక్కువగా ధనిక, సంపన్నవర్గాలే వినియోగించుకుంటున్నాయని, అర్హులైన పేదలకు అవి అందడంలేదని సోమవారం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
కాలం చెల్లిన సినిమాటోగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త చట్టం అవసరమని సమాచార శాఖ స్థాయీ సంఘం సూచించింది. వైమానిక దళ సామర్థ్యం 42 యుద్ధవిమాన విభాగాలనుంచి 25 విభాగాలకు తగ్గడం సమంజసం కాదని, యుద్ధవిమానాల విభాగాలు 45కు పెరగవలసిన అవసరం ఉందని రక్షణ శాఖపై స్థాయీ సంఘం అభిప్రాయపడింది.
వరద బాధిత జమ్మూ కశ్మీర్ పునర్నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను, పథకాన్ని కేంద్రం, కశ్మీర్ ప్రభుత్వం తయారు చేయాలని హోం మంత్రిత్వ వ్యవహారాలపై స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.